కొత్తగూడెంలో 51.5 డిగ్రీల ఉష్ణోగ్రత!

23 May, 2016 20:19 IST|Sakshi

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా):  కొత్తగూడెంపై సూర్యప్రతాపం కొనసాగుతోంది. వరుసగా రెండు రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం 52 డిగ్రీలు, సోమవారం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిన్నచిన్న వ్యాపారస్తులు షాపులను మూసివేసి ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పట్టణం మొత్తం వెలవెలపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోగా, షాపులన్నీ మూతపడ్డాయి.

పట్టణంలో రెండురోజులుగా అనధికారిక కర్ఫ్యూ కొనసాగుతోంది. రోడ్ల వెంట వ్యాపారాలు చేసుకునేవారు ఎండదెబ్బకు కుదేలవుతున్నారు. ఎండలతో పండ్లు పాడైపోతుండటంతో పండ్ల వ్యాపారులు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. జ్యూస్ పాయింట్లు, చెరకు రసం, కూల్‌డ్రింక్‌ లకు బాగా గిరాకీ పెరిగింది. చలివేంద్రాలు అంతంతమాత్రమే సేవలందిస్తుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు పాదచారులు, ప్రయాణీకులు లీటరు నీటిని రూ.8లకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు గొడుగులు, ముఖానికి రుమాళ్లు, టోపీలు ధరించి వస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల వద్ద మరో రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉండటంతో కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

>
మరిన్ని వార్తలు