తెగిపడిన కైలాసగిరి రోప్ వే

1 Feb, 2016 07:40 IST|Sakshi
తెగిపడిన కైలాసగిరి రోప్ వే

కొక్కెం ఊడిపడిన కేబుల్‌కారు
చెట్ల మధ్య ఇరుక్కుపోవడంతో తప్పిన గండం
ఆరుగురికి స్వల్పగాయాలు

 
విశాఖపట్నం: ఆదివారం ఆనందంగా గడపటానికి వచ్చిన పర్యాటకులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాఖపట్నం   కైలాసగిరిపై రోప్‌వే కొక్కెం ఊడిపోవడంతో కేబుల్ కారు తెగిపడింది. దీంతో సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. కొండపై ఉన్న చెట్ల మధ్యలో ఇది చిక్కుకుపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సాయంత్రం 4 గంటల సమయంలో వీరు కొండపై నుంచి కిందకు దిగేందుకు రోప్‌వే వద్దకు వెళ్లి కేబుల్‌కారు ఎక్కారు. అయితే రోప్‌వే స్టేషన్ దాటిన వెంటనే కేబుల్‌కారుకు ఉన్న కొక్కెం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో కేబుల్ కార్ తెగిపడింది. ఈ ప్రమాదంలో అలేఖ్య (24), ఆశిష్‌కుమార్(38), ఆర్.మనీషా(19), ఆర్.సుజన(33), యాచిక సాగర్(6), షియాకొండల్(6)కు స్వల్పగాయాలయ్యాయి.

ఈ హఠాత్‌పరిణామానికి సందర్శకులంతా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమయిన నిర్వాహకులు వెనుక వస్తున్న కేబుల్‌కార్లను వెంటనే నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కేబుల్‌కారు స్టార్ట్ అయిన వెంటనే సంఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. అదే కొద్ది దూరం ప్రయాణించిన తరువాత జరిగినట్టయితే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని వెంటనే కె.జి.హెచ్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అయిన వెంటనే కేర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు