64 వేల ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు

18 Jun, 2017 00:03 IST|Sakshi
కరప (కాకినాడ సిటీ) : 
జిల్లాలో పాల దిగుబడులు పెంచేందుకు 64 వేల ఎకరాల్లో గ్రామ గ్రామానా పశుక్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పశు వైద్యశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి కరప ఏడీ డాక్టర్‌ ఎస్‌.రూపకళ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మూడున్నర లక్షల పాడి పశువులుంటే 35 శాతమే పశుగ్రాసం లభ్యమవుతోందన్నారు. మిగిలిన 65 శాతం పశువుల మేత సమకూర్చేందుకు ఊరూరా పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలతో సొంత, కౌలుభూమిలో పచ్చిమేత పశుగ్రాసం పెంచి, రైతులకు కిలో రూపాయి చొప్పున పచ్చిమేత అమ్ముకునేలా చూస్తామన్నారు. ఇందుకు ఎకరాకు రూ.15,680 ఏడాదికి అందజేస్తామన్నారు. 15 టన్నుల సుగర్‌ గ్రేజ్‌ విత్తనాలు అన్ని పశువుల ఆస్పత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని రాయితీపై కిలో రూ.82లకే ఇస్తామన్నారు. ఎకరానికి 5 కిలోల విత్తనాలు సరిపోతాయన్నారు. అజోలా రకం కిట్టు 90 శాతం రాయితీపై రూ.325లకు ఇస్తామన్నారు. ఈ నాచురకం మేతలో 32 శాతం ప్రోటీసులు ఉంటాయన్నారు. రంపచోడవరం, రాజానగరం, రాజోలు, శంఖవరం మండలాలకు 4 సంచార పశు వైద్యశాలలు మంజూరైనట్టు ఆయన చెప్పారు. 
మరిన్ని వార్తలు