7 రోజులు..38 కోట్లు..

24 Mar, 2017 00:22 IST|Sakshi
7 రోజులు..38 కోట్లు..

–మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు మిగిలింది వారం రోజులే
- ఈ సారైనా లక్ష్యం సాధించేరా?


కార్పొరేషన్‌ : 1
మునిసిపాలిటీలు : 8
నగర పంచాయతీలు : 3
మొత్తం అసెస్‌మెంట్లు : 2,42,248
వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను  : రూ.6,455.54 లక్షలు
ఇప్పటి దాకా వసూలైన మొత్తం : రూ.2,614.91 లక్షలు
వారం వ్యవధిలో వసూలు చేయాల్సిన మొత్తం : రూ.3,840.63 లక్షలు


ధర్మవరం : పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలు, మడకశిర, పామిడి, పుట్టపర్తి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను  మొత్తం రూ.6,455.54 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. గురువారం సాయంత్రం నాటికి రూ.2,614.91 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు.

40.50 శాతం మాత్రమే వసూళ్లు సాధించి.. పూర్తిగా వెనుకంజలో ఉన్నారు. అనంతపురం నగర పాలక సంస్థలో రూ.2,608.45 లక్షల డిమాండ్‌ ఉండగా.. రూ.1,140.97 లక్షలు మాత్రమే (43.74 శాతం) వసూలు చేయగలిగారు. ఇక మడకశిర నగర పంచాయతీ కేవలం 12.78 శాతం పన్ను వసూళ్లతో జిల్లాలోనే చివరిస్థానంలో ఉంది. ఎప్పటిలాగే తాడిపత్రి మునిసిపాలిటీ లక్ష్యంలో ఇప్పటికే 65.14 శాతం వసూలు చేసి మరోసారి  జిల్లా టాపర్‌గా నిలిచింది. మున్సిపాలిటీల్లో అత్యధిక అసెస్‌మెంట్లు కల్గిన హిందూపురం 39.42 శాతం వసూలు సాధించగా, ధర్మవరం 40.69 శాతం మాత్రమే చేయగల్గింది.

తప్పెట మోగించినా పెరగని వసూళ్లు
మొండి బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు కదిరి మునిసిపల్‌ అధికారులు వినూత్న పద్ధతిని అవలంబించారు. బకాయిదారుల ఇళ్ల ముందు తప్పెట మోగించారు. ఇళ్లు, సంస్థలకు తాళాలు కూడా వేశారు. అయినా మొత్తం లక్ష్యంలో 28.09 శాతం పన్నులు మాత్రమే వసూలు చేయగలిగారు. కదిరి మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 20,042 అసెస్‌మెంట్లకు గాను రూ.510.2 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.143.3 లక్షలు మాత్రమే రాబట్టారు. ఇదేవిధంగా జిల్లాలోని చాలా మునిసిపాలిటీలు తమ లక్ష్యంలో సగం కూడా వసూలు చేయలేకపోయాయి.

మిగిలింది వారమే..
 పన్నుల వసూలుకు  వారం గడువు మాత్రమే ఉంది. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో 2,42,248 అసెస్‌మెంట్లకు గాను దాదాపు 10 వేల దాకా ప్రభుత్వ కార్యాలయాలకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల నుంచి దాదాపు రూ. 10 కోట్ల మేర బకాయిలు రావాలి. పాత బకాయిలపై ప్రభుత్వం వడ్డీమాఫీ ఎత్తివేయడం కూడా వసూళ్లు మందగించడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉన్న వారం వ్యవధిలో 80 శాతమైనా వసూళ్లు చేయగలిగితే  ఆయా మునిసిపాలిటీలలో అభివృద్ధి  పనులు చేపట్టడానికి వీలవుతుంది.

మరిన్ని వార్తలు