20 ఏళ్లలో ఏడోసారి

19 Feb, 2017 21:36 IST|Sakshi
20 ఏళ్లలో ఏడోసారి
- శివరాత్రి పూజకు సంగమేశ్వరుడు సిద్ధం
 
 ఆత్మకూరు:  మరోసారి శ్రీ సంగమేశ్వర క్షేత్రం కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడుతోంది. గత ఏడాది ఆగస్టు నెలలో కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరడంతో సంగమేశ్వర క్షేత్రం నీట మునిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 839 అడుగులకు నీటి మట్టం చేరడంతో సంగమేశ్వర దేవాలయంలో బయటపడింది. ఏడాది మహాశివరాత్రి వేళ పూజలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. మరో ఐదు అడుగుల నీరు తగ్గితే గర్భాలయంలో శివ లింగం కూడా బయటపడనుంది. భక్తులు నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి సంగమేశ్వరం క్షేత్రం బ్యాక్‌వాటర్‌లో నీట మునుగుతోంది.
 
దాదాపు 20 ఏళ్లలో ఇప్పటి వరకు శివరాత్రి సమయానికి ఆరు సార్లు బయటపడగా.. ఏడో సారి కూడా సంగమేశ్వరుడు పూజలకు సిద్ధమవుతున్నాడు. 2003 నుంచి ఈ క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం నాటికి పూర్తిగా బయటపడడం ప్రారంభమైంది. 2004, 2005 వరుసగా శివరాత్రి వేడుకలు  నిర్వహించారు. 2006 నుంచి 2010 వరకు ఽవర్షాలు సంవృద్ధిగా కురవడంతో ఐదేళ్లు పూర్తి స్థాయిలో బయటపడ లేదు. 2011లో నాలుగో సారి ఈ క్షేత్రం జలదిగ్బంధం వీడింది. 2012 నుంచి వరుసగా మరో మూడేళ్లు శ్రీశైలం జలాశయాలు తగ్గక పోవడంతో శివరాత్రి వేడుకలు జరగలేదు. అనంతరం 2015, 2016లో వరుసగా సంగమేశ్వరుడు దర్శనమచ్చారు.
 
ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు క్షేత్రం గోపురం కూడా కనిపించలేదు. స్వామి శివరాత్రి పూజలు నిర్వహించడం సాధ్యం కాదని భక్తులు అనుకున్నారు. అయితే 20 రోజుల్లో డ్యామ్‌లో నీటిని దిగువకు విడుదల చేయడంతో అనతి కాలంలోనే క్షేత్రం జలదిగ్బంధం నుంచి బయటపడింది.   
 
శ్రీ సంగమేశ్వర కల్యాణానికి ఏర్పాట్లు: 
ఎట్టకేలకు కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడిన సంగమేశ్వరుడు కల్యాణ మహోత్సవానికి సిద్ధమవుతున్నాడు. 24న శివరాత్రి సందర్భంగా శుక్రవారం స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, విశేషపూజలు, అర్ధరాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. 25న స్వామివార్ల కల్యాణానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ పేర్కొన్నారు.  
 
మరిన్ని వార్తలు