రాష్ట్రవ్యాప్తంగా 8.56 లక్షల మొక్కలు

9 Aug, 2016 19:58 IST|Sakshi
-రాష్ట్ర మార్కెటింగ్ డెరైక్టర్ శరత్
-జనగామ మార్కెట్ సూపర్ వైజర్ సస్పెన్షన్
 
జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో భాగంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 8.56 లక్షల మొక్కలు నాటామని రాష్ట్ర మార్కెటింగ్ డెరైక్టర్, మార్క్‌ఫెడ్ ఎండి హడావత్ శరత్ తెలిపారు. వరంగల్ జిల్లా జనగామ వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేసి హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం శరత్ మాట్లాడుతూ.. గత ఏడాది రాష్ట్రంలోని 150 మార్కెట్ కమిటీల్లో 5.50లక్షల మొక్కలు నాటితే, 80శాతం మేర సంరక్షించామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 180 మార్కెట్, 50 సబ్ యార్డుల్లో 8.56 లక్షల మొక్కలు నాటామని, నాటిన మొక్కలను కాపాడుకునే దిశగా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. బోర్లు, డ్రిప్, ప్రహారీ గోడలు లేని ప్రదేశాల్లో ఫెన్షింగ్ ఏర్పాటు చేసుకునేందుకు నిధులు మంజూరీ చేస్తున్నామని తెలిపారు. మొక్కలను సంరక్షించకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠన చర్యలు తప్పవని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు ఉద్యోగలను సస్పెండ్ చేశామని చెప్పారు.
 
రూ.1024 కోట్లతో 330 గోదాంల నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా రూ.1024 కోట్లతో 17.50లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 గోదాంల నిర్మాణం చేపట్టామని, ప్రస్తుతం 95 గోదాంల నిర్మాణం పూర్తి చేశామని శరత్ తెలిపారు. అక్టోబర్ మాసానికల్లా వందశాతం అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. రూ. 285 కోట్లతో నూతనంగా కవర్ షెడ్డులు, కొత్త ప్లాట్ ఫాంలు, పాల్తీన్ కవర్లతో పాటు అన్ని మార్కెట్‌లో కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు.
 
జనగామ సూపర్ వైజర్ సస్పెన్షన్
హరితహారంలో మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన జనగామ సూపర్ వైజర్ కృష్ణను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ డెరైక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో మొక్కల సంరక్షణపై దృష్టి సారించి కాపాడితే సస్పెన్షన్ ఉత్తర్వులను ఎత్తివేస్తామన్నారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కార్యదర్శి నాగేశ్వర శర్మపై శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మొక్కను కాపాడుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరీ చేస్తే సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ మేనేజర్ రంజిత్‌రెడ్డి, జిల్లా నోడల్ అధికారి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. 
 
 
మరిన్ని వార్తలు