కందుల కొనుగోలుకు 8 కేంద్రాలు

4 Jan, 2017 00:20 IST|Sakshi
- ఎంఎస్‌పీ, బోనస్‌ కలిపి రూ.5050 మద్దతు ధర
కర్నూలు(అగ్రికల్చర్‌) : జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు 8 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. మంగళవారం సాక్షిలో కందులు..ఆశలు తలకిందులు శీర్షికతో ప్రచురించిన కథనానికి జేసీ స్పందించారు. వెంటనే మార్క్‌ఫెడ్‌ అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. మార్కెట్‌లో కందుల ధర పడిపోవడంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్‌పీ, బోనస్‌ కలిపి రూ.5050 కొనుగోలు చేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానిపల్లె, ఆత్మకూరు, నంద్యాల మార్కెట్‌ యార్డుల్లో  కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం, ఇతర వ్యర్థ పంటల గింజలు 1 శాతం, దెబ్బతిన్న గింజలు 3, పగిలిన, విరిగిన గింజలు 3 శాతం, పురుగు పట్టిన గింజలు 3 శాతం, పూర్తిగా తయారుకాని గింజలు 3 శాతం, తేమ 12శాతం వరకు ఉండాలని వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌(08518–229110)లో సంప్రదించాలన్నారు. 
మరిన్ని వార్తలు