ఎనిమిది మంది గంజాయి స్మగ్లర్ల అరెస్టు

17 Sep, 2016 23:29 IST|Sakshi
ఎనిమిది మంది గంజాయి స్మగ్లర్ల అరెస్టు
  • 146 కేజీల గంజాయి, రూ. 12,200 స్వాధీనం 
  • రాజమహేంద్రవరం క్రైం: 
    గంజాయిని తరలిస్తున్న ఎనిమిది మందిని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్టు రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె ఆ వివరాలను తెలియజేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు రాజానగరం పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌నాయుడు శుక్రవారం సాయంత్రం రాజా నగరం మండలం చక్రద్వారబంధం సమీపంలోని గైట్‌ కాలేజీ వద్ద ఎన్‌హెచ్‌ 16పై తనిఖీలు నిర్వహిస్తుండగా విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం పైపు వస్తున్న ఫోర్ట్‌ కారు, మారుతీలో 146 కేజీల గంజాయిని తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారన్నారు. ఫోర్డు కారులో విశాఖపట్నం, గాజువాకకు చెందిన అక్కిరెడ్డి నానాజీ, ఢిల్లీకి చెందిన సచ్చిదానంద సింగ్‌ బటికియా, మధ్యప్రదేశ్‌ కు చెందిన అంజద్‌ ఖాన్, ఒడిశాకు చెందిన బికాష్‌ కుమార్‌ బస్తియా, కారు డిక్కీలో 5 ప్లాస్టిక్‌ సంచులలో, 73 బస్తాల్లో ఒక్కొక్కటి రెండు కేజీల ప్యాక్‌లతో రవాణా చేస్తున్నారని తెలిపారు. రెండవ కారులో దండ్రు రవి కుమార్‌ , కుమ్మరి కన్నయ్య దొర, మాడుగుల పవన్‌ కళ్యాణ్, పెనుగొండ సింహాచలం  పైలట్‌ చేస్తూ పట్టుబడ్డారన్నారు. గంజాయిని  ఏజెన్సీ ప్రాంతమైన జి. మాడుగుల నుంచి హైదరాబాద్‌కు, అక్కడ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్టు తెలిపారు. 146 కేజీల గంజాయి విలువ సుమారు రూ. 7. 30 లక్షలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి 12 సెల్‌ ఫోన్‌లు, రూ. 12,200 నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజానగరం ఎమ్మార్వో సమక్షంలో కార్లు సీజ్‌ చేశారన్నారు. నిందితులను రిమాండ్‌ కోసం తరలిస్తున్నామని పేర్కొన్నారు.  
     
మరిన్ని వార్తలు