ప్రజావాణికి 83 ఫిర్యాదులు

26 Sep, 2016 22:21 IST|Sakshi
ప్రజావాణికి 83 ఫిర్యాదులు
  • డీఆర్వో కార్యాలయానికి మారిన వేదిక
  • స్పెషల్‌ ఆఫీసర్‌ సమీక్ష నేపథ్యంలో..
  • వినతులు స్వీకరించిన డీఆర్వో
  • ఇందూరు:
    కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వేదిక ఈసారి ఆర్డీవో కార్యాలయానికి మారింది. జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రత్యేక అధికారి అశోక్‌కుమార్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. దీంతో ప్రజావాణి వేదికను డీఆర్వో కార్యాలయానికి మార్చారు. పోలీసులు ఫిర్యాదుదారులను డీఆర్వో కార్యాలయానికి మళ్లించారు. కలెక్టర్‌ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి సమీక్షలో ఉండడంతో డీఆర్వో పద్మాకర్, కలెక్టరేట్‌ ఏవో గంగాధర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వారం మొత్తం 83 ఫిర్యాదులునమోదయ్యాయి. 
    నష్ట పరిహారం చెల్లించాలి
    పంచగూడ బ్రిడ్జి రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్నామని, మార్కెట్‌ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని నందిపేట్‌ మండలంలోని సీహెచ్‌ కొండూర్, బజార్‌ కొత్తూర్, ఉమ్మెడ, లక్కంపల్లి, చింరాజ్‌పల్లి బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు డీఆర్వో పద్మాకర్‌కు వినతిపత్రం అందజేశారు. పండగూడ బ్రిడ్జి నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్నామని, రూ.15 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని రైతులు సంద బాబురాజ్, ఎర్రం ముత్యం,పోశెట్టి, రాములు తదితరులు కోరారు.
    రోడ్డుతో నరకం అనుభవిస్తున్నాం
    తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మద్నూరు మండలం చిన్న తడ్లూర్‌ గ్రామస్తులు డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నరకం అనుభవిస్తున్నామని తెలిపారు. పాముకాటుకు గురైన రవిదాస్‌ను ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తుండగా, రోడ్డు సరిగా లేక ఆలస్యమైందని, దీంతో ఆయన మార్గమధ్యలోనే చనిపోయాడని వివరించారు. సరైన సమయంలో వైద్యం అందక గర్భిణులు, పిల్లలను కూడా ఇలాగే కోల్పోయామని వాపోయారు. అలాగే, పెన్షన్‌ రేషన్‌ సరుకులు కూడా పక్క గ్రామానికి వెళలి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ గ్రామానికి కొత్త రోడ్డు వేయించాలని స్థానికులు బాలాజీ, హన్ములు, మారుతి, శంకర్, తదితరులు కోరారు.
    ఎన్‌సీఎల్‌పీ పీడీని తొలగించాలి
    తమకు అన్యాయం చేసిన ఎన్‌సీఎల్‌పీ పీడీ సుధాకర్‌రావును తొలగించాలని డిమాండ్‌ చేస్తూ పలువురు మెసేంజర్లు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. అకారణంగా తమను తొలగించారని, దీంతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. అయితే ఆర్వీఎం శాఖ ఐఈడీ కో–ఆర్డినేటర్, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఎన్‌సీఎల్‌పీ పీడీగా పని చేస్తున్న సుధాకర్‌రావుకు అర్హత లేదని, ఐఈడీ పరీక్ష రాయకుండానే గెజిటెడ్‌ అధికారిగా చలామణి అవుతున్నారని వారు ఆరోపించారు. అలాగే ఫారిన్‌ సర్వీస్‌పై రెండేళ్లకు మించి పని చేయరాదని నిబంధన ఉన్నా ఎన్‌సీఎల్‌పీ పీడీగా, ఐఈడీ కో–ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారని, ఆయన్ను వెంటనే అసలు స్థానమైన ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా పంపించాలని గంగాధర్, మహేశ్‌ తదితరులు విజ్ఞప్తి చేశారు.
    దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
    దౌర్జన్యం చేస్తూ తమ గ్రామ చెరువులో చేపలు పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ మండలం మల్లారం గ్రామానికి చెందిన మత్స్యకారులు డీఆర్వోకు మొర పెట్టుకున్నారు. 1946 నుంచి తమ గ్రామ చెరువులో 180 కుటంబాలు చేపలు పట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే, రాజమండ్రికి చెందిన లంబాడి వ్యక్తులు డీసీఎం వ్యానుల్లో వచ్చి చెరువులో అక్రమంగా చేపలు పడుతున్నారని, చేపలు పట్టొద్దని చెబితే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు సాయన్న, లింగం, అబ్బయ్య తదితరులు కోరారు.
    ఆర్థిక సాయం ఇప్పించాలి..
    భారీ వర్షాలతో తమ ఇల్లు కూలిపోయిందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని నగరంలోని ఇస్లాంపుర, కొజ్జకాలనీకి చెందిన అబ్దుల్‌ రషీద్‌ కుటుంబ సభ్యులు డీఆర్వోకు విజ్ఞప్తి చేశారు. వర్షాలతో ఉన్న గూడు లేకుండా పోయిందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తే ఇంటికి మరమ్మతులు చేయించుకుంటామని తెలిపారు.
    విచారణ జరిపించాలి
    బోధన్‌ మండలంలోని అమ్థాపూర్‌ కస్తూర్బాగాంధీ పాఠశాలలో అకౌంటెంట్‌ పోస్టు నియామకంలో అక్రమాలు జరిగాయని బోధన్‌ని శక్కర్‌నగర్‌కు చెందిన గీత డీఆర్వోకు ఫిర్యాదు చేశారు. డీటీసీవో శకుంతల, ఎస్‌వో హిమబిందు కలిసి అకౌటెంట్‌ పోస్టు నియామకంలో చక్రం తిప్పి అనర్హులకు అప్పగించారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. 
>
మరిన్ని వార్తలు