బ్రిడ్జి నిర్మాణానికి 83 ఏళ్లా?

8 Mar, 2017 23:53 IST|Sakshi
బ్రిడ్జి నిర్మాణానికి 83 ఏళ్లా?

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
రూ.2.60 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన
హాజరైన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి


గుమ్మడిదల(జిన్నారం): బ్రిడ్జి నిర్మాణానికి 1934లో శంకుస్థాపన చేసి.. నేటి వరకు నిర్మాణ పనులు చేపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందని, దీన్ని బట్టి గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తోందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం గుమ్మడిదల మండలం బొంతపల్లి కమాన్‌ నుంచి బొంతపల్లి ఆలయం వరకు ఉన్న రోడ్డుపై రూ.2.60 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గత పాలకులు ఇక్కడి బ్రిడ్జి నిర్మాణంలో 83 ఏళ్లుగా నిర్లక్ష్యం వహించారన్నారు. దీనిబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా తెలుస్తోందన్నారు.

స్వరాష్ట్రం సాధించిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారని చెప్పారు. అందులో భాగంగానే అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్లను అభివృద్ధి చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిర్మించి తీరుతామన్నారు. ఎంపీపీ రవీందర్‌రెడ్డి,  ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ శ్రవణ్‌ ప్రకాశ్, నాయకులు చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, ఉమారాణి, భద్రప్ప, గౌరీశంకర్‌గౌడ్, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, శంకర్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా