86 ఏళ్లుగా నగర సంకీర్తన

14 Sep, 2016 22:22 IST|Sakshi
86 ఏళ్లుగా నగర సంకీర్తన
నరసరావుపేట ఈస్ట్‌: నగర సంకీర్తన...బ్రహ్మ ముహుర్త కాలంలో భగవంతుని కీర్తిస్తూ సంకీర్తన పారాయణం చేస్తూ గ్రామాలలో భక్తి పరాయణులు నిర్వహించే ప్రక్రియ. సర్వేజన సుఖినోభవంతు అనే ఆర్యోక్తికి అనుగుణంగా సర్వమానవ శ్రేయస్సును కోరుతూ నిర్వహించే నగరసంకీర్తన నేడు కనుమరుగై పోయింది. నేడు వాహనాల రణగొణధ్వనులు తప్ప గ్రామగ్రామాన ప్రాతః కాలంలో లయబద్దంగా వినబడే కీర్తనలు ఇప్పుడు వినపడకుండా పోయాయి. నేటి యువతకు నగర సంకీర్తన అంటేనే తెలియని పరిస్థితి నెలకొంది. అయితే నరసరావుపేటలో గత 86 ఏళ్లుగా క్రమం తప్పకుండా సాగుతున్న నగర సంకీర్తన ఇక్కడి అధ్యాత్మికతకు అద్దం పడుతుంది. శ్రీపట్టాభిరామస్వామి ఆలయం భక్తుల ఆధ్వర్యంలో 1933లో ప్రారంభమైన నగర సంకీర్తన భారీ తుఫాన్‌లో సైతం కొనసాగడం విశేషం. ప్రతి రోజు ఉదయం 4.30 గంటలకు ప్రారంభమయ్యే నగర సంకీర్తన పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగి 6 గంటల సమయంలో తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. 1933 నుంచి మాఘమాసం ఏకాదశి నాడు ఆలయంలో ఆనాటి పెద్దలు కూకుట్ల నరసింహారావు, పత్తి పుల్లయ్య, కొలిశెట్టి గురుమూర్తి, నాగసరపు కోటయ్య, తాటికొండ ఆంజనేయులు తదితర పెద్దలు వంద సంవత్సరాలు నగర సంకీర్తన నిర్వహించాలని ప్రమాణం చేశారు.
 
శ్రీపట్టాభిరామస్వామి వారు ఈ మేరకు ప్రమాణం చేయించుకుని ఈ ప్రాంతమంతా సుభీక్షంగా ఉంచేలా వాక్కు ఇచ్చినట్టు పెద్దలు చెప్తారు.  అప్పటి ప్రమాణం మేరకు ఎన్ని అటంకాు ఎదురైనా ఈ నగరసంకీర్తన మాత్రం ఆగలేదు. రాజకీయ అలజడులకు నిలయమైన నరసరావుపేటలో ఎన్నో సార్లు కర్ఫ్యూ విధించినప్పటికి సంకీర్తనపరులను పోలీసులు సైతం వీరి పట్ల ఆ సమయంలో ఉదారంగా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయి. మరో 14 సంవత్సరాలలో నగర సంకీర్తనకు వందేళ్ళు పూర్తవుతాయి. ఆలయ నిర్మాణ ధర్మకర్త నాగసరపు సుబ్బరాయశ్రేష్టి అనంతరం నాగసరపు రామారావు, ప్రస్తుత ధర్మకర్త మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నాగసరపు సుబ్బరాయగుప్తా ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్విఘ్నంగా కొనసాగుతోంది.  ప్రస్తుతం నాటి పెద్దల వారసులుగా  కొత్త హరనాథ్‌బాబు, కొప్పరావూరి లక్ష్మీనారాయణ, కూరపాటి లక్ష్మీ కోటేశ్వరరావు, అనుమోలు తాండవకష్ణ, తవ్వా హనుమంతురావు, పొట్టి కోటేశ్వరరావు, సన్ని«ధి రామకోటేశ్వరరావు తదితరులు క్రమం తప్పకుండా నగరసంకీర్తన నిర్వహిస్తున్నారు.
మరిన్ని వార్తలు