పిల్లలూ..నేను వెళ్లిపోతున్నా!

8 Aug, 2017 00:43 IST|Sakshi
పిల్లలూ..నేను వెళ్లిపోతున్నా!

గీసుకొండ(పరకాల): పిల్లలూ ఇక సెలవు..నేను వెళ్లిపోయే సమయం వచ్చింది. 65 సంవత్సరాలకు పైగా మీకు విద్యనందించిన నేను అలసి సొల శిథిలమైపోయే స్థితికి చేరుకున్నా. వేలాది మంది విద్యార్థులను అక్కున చేర్చుకుని భావి పౌరులుగా తీర్చిదిద్దానని, నా నీడన చదివిన వారెందరో ప్రయోజకులయ్యారనే తృప్తి నాకు ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, కండక్టర్లు, డ్రైవర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతోపాటు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న నా విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ధర్మారం చుట్టు పక్కల పది గ్రామాలకు చెందిన ఎందరో  విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పింది నేనే అని చెప్పడానికి ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. 

ఉదయం లేచింది మొదలు సాయంత్రం అయ్యే వరకు ప్రతిరోజు నావద్దే మీ చదువు, ఆటపాటలు సాగాయి. చదువులమ్మ ఒడినై మిమ్ములను కన్న తల్లిలా లాలించా. తండ్రిలా ముందుకు నడిపించా. ఇక నాకు వెళ్లిపోయే సమయం వచ్చిందని అధికారులు నిర్ధారించారు. రేకులు, డంగు సున్నంతో నిర్మించిన నా రూపాన్ని లేకుండా చేయడానికి వేలం పాట నిర్వహించారు. నన్ను కూల్చడానికి ఓ కాంట్రాక్టర్‌ రూ. 2.55 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. త్వరలోనే ఆయన తన పని ప్రారంభించి నన్ను నేలమట్టం చేస్తాడు. నేను లేనని మీరు బాధపడొద్దు. నా పునాదులపైనే కొత్తగా తరగతి గదులను త్వరలో నిర్మిస్తారు. మిమ్ములను వీడి కాలగర్భంలో కలిసి పోతున్నాననే బాధ నాకు లేదు. చాలా సంతోషంగా, సంతృప్తిగా వెళ్లిపోతా.. మీ జ్ఞాపకాలు చాలు నాకు..ఇక సెలవు..ప్రేమానురాగాలతో..   

మరిన్ని వార్తలు