ఏ తల్లి కన్నబిడ్డో..

22 Jul, 2016 17:47 IST|Sakshi
ఏ తల్లి కన్నబిడ్డో..

సాక్షి, కడప :

ఆరు నెలల క్రితం ఓ తల్లి వదిలేసిన పురిటి బిడ్డను కడప శిశుగృహ సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. బరువు తక్కువగా ఉన్న ఆ బిడ్డకు ఐసీడీఎస్‌ అధికారులు మెరుగైన  వైద్యం చేయించి సంరక్షించారు. ఇప్పుడు ఆ బుజ్జాయి  4.5 కిలోల బరువు ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి..
 ఆరు నెలల క్రితం రాజంపేట మున్సిపాలిటీ సమీపంలోని వంక ప్రాంతంలో ఓ తల్లి పురిటి బిడ్డను వదిలేసి వెళ్లింది. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలీదు ఆ చిన్నారిని స్కూల్‌ బ్యాగులో ఉంచి వెళ్లింది. పసికందు ఏడుస్తుంటే సమీపంలో దుస్తులు ఉతుకుతున్న రజకులు గమనించారు. ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బరువు తక్కువగా ఉందని గ్రహించారు. అదే సమయంలో ఒక ముస్లిం సోదరుడు (పండ్ల వ్యాపారి) అటుగా వచ్చాడు. ఆయనకు ఐదుగురు ఆడ పిల్లలు. బరువు తక్కువగా ఉన్న ఈ చిన్నారిని కడపకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. నాలుగైదు వేలు ఖర్చు చేశాడు. ఆ తర్వాత కడపలోని అధికారులు సమాచారం ఇచ్చాడు. వెంటనే అధికారులు రిమ్స్‌కు తరలించి వైద్య సేవలు అందించి విషమ పరిస్థితిలో ఉన్న చిన్నారిని కాపాడారు.

ఐసీడీఎస్‌ పీడీ రాఘవరావు ప్రత్యేక శ్రద్ధతీసుకున్నారు. అక్కడి నుంచి కడప నగర శివార్లలోని శిశుగృహకు తరలించి ప్రత్యేకంగా చూసుకుంటూ వచ్చారు. పుట్టినపుడు 800 గ్రాముల బరువున్న ఆ  చిన్నారి ప్రస్తుతం 4.5 కిలోల బరువు ఉన్నాడు.  శిశు విహార్‌లో ఐసీడీఎస్‌ పీడీ పర్యవేక్షణలో చిన్నారికి రమణకుమార్‌ అని నామకరణం కూడా చేశారు. ఆ చిన్నారి ప్రస్తుత వయస్సు ఆరు నెలలు. ముద్దుగా ఉన్న ఆ బుజ్జాయిని గురువారం సాయంత్రం దంపతులు  దత్తత తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు