అవయవ దాతను పిండేశారు!

19 Jun, 2016 01:15 IST|Sakshi
అవయవ దాతను పిండేశారు!

- అవయవాలను దానం చేసిన ఏడుకొండలు కుటుంబం
- బాధితుడి కుటుంబానికి దక్కని స్వాంతన
- అతడి వైద్యానికి రూ.1.20 లక్షల బిల్లు వేసిన కార్పొరేట్ ఆసుపత్రి
- బిల్లు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం
 
 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికి రూ.లక్షల్లో ఫీజు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడింది ఓ అవయవ దాత కుటుంబం. బ్రెయిన్ డెడ్‌కు గురై ఆరు అవయవాలను దానం చేసిన వ్యక్తి కుటుంబానికి సర్కారు పైసా సాయం కూడా అందించలేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్) చరిత్ర సష్టించిందని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆ గుండెను ఇచ్చిన కుటుంబాన్ని మాత్రం విస్మరించింది. శస్త్రచికిత్సను విజయవంతం చేసిన డాక్టర్ ఆళ్ల గోపాలకష్ణ గోఖలేను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఘనంగా సత్కరించారు.

ఆరుగురికి అవయవదానం చేసిన కుటుంబాన్ని కనీసం గుర్తించలేదు. తమ లాంటి పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యం ఖర్చులనైనా భరించాలని అవయవదాత భార్య, బిడ్డలు కోరుతున్నారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. సహాయం అందించాలని కోరారు. పేద కుటుంబానికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే బొండా ఉమా కోరగా పరిశీలిద్దామని చంద్రబాబు ముక్తాయించారు.

 అసలేం జరిగిందంటే...: విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో నివసించే ఇమడాబత్తిన ఏడుకొండలు(44) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మే 13వ తేదీన మోటారుసైకిల్‌పై వెళుతూ బీఆర్‌టీఎస్ రోడ్డులో బస్సు ఢీకొని గాయాలపాలయ్యాడు. వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యం తీరుతో బెంబేలెత్తిన ఏడుకొండలు కుటుంబం అతడిని వెంటనే మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేర్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఫోన్‌లో వాకబు చేసిన తరువాత బ్రెయిన్ డెడ్ అని 19వ తేదీన డాక్టర్లు చెప్పారు. అవయవదానం గురించి ఏడుకొండలు కుటుంబానికి జీవన్‌దాన్ ట్రస్టు ప్రతినిధి వివరించారు. ఏడుకొండలుకు చెందిన ఆరు అవయవాలను దానం చేయడానికి అతడి భార్య నాగమణి, పిల్లలు జాహ్నవి, దీపక్ అంగీకరించారు. గుండెను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మరో డ్రైవర్‌కు అమర్చారు. ఒక మూత్రపిండాన్ని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో రోగికి అమర్చారు. మరో మూత్రపిండాన్ని విజయవాడలోని అరుణ్ కిడ్నీ సెంటర్‌కు, కాలేయాన్ని  తాడేపల్లెలోని మణిపాల్ ఆసుపత్రికి, రెండు కళ్లను వాసన్ ఐ కేర్‌కు జీవన్‌దాన్ ట్రస్టు అందజేసింది.

 గుండె మార్పిడికి రూ.35 లక్షలు
 ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఏడుకొండలుకు వైద్యం అందించినందుకు యాజమాన్యం రూ.1.20 లక్షలు వసూలు చేసింది. బాధితుడి కుటుంబం అప్పులు చేసి మరీ ఈ సొమ్మును చెల్లించింది. కర్మకాండలతోపాటు ఇతరత్రా ఖర్చులకు రూ.80 వేలకు పైగా అయ్యింది. ఏడుకొండలు నుంచి తీసుకున్న అవయవాలను ఇతర రోగులకు అమర్చడానికి కార్పొరేట్ ఆసుపత్రులు రూ.కోటికి పైగా వసూలు చేస్తాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గుండె మార్పిడికి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు అవుతుందని జీజీహెచ్ వైద్యులు చెప్పారు.

ఒక మూత్రపిండం మార్పిడికి రూ.30 లక్షల నుంచి రూ.38 లక్షలు, కాలేయం మార్పిడికి రూ.30 లక్షలకు పైగా, కంటి మార్పిడికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు తీసుకుంటున్నాయి. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్య ఖర్చుల్లో తేడాలు ఉంటాయి. అవయవ దాతను రోగి సమకూర్చుకుంటే బిల్లుల్లో మార్పులు ఉంటాయి. గొప్ప ఆశయంతో అవయవాలను దానం చేసినప్పటికీ బాధితుల కుటుంబాలు రూ.లక్షల్లో బిల్లులను చెల్లించాల్సి వస్తోంది. అవయవ దానం చేసిన పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వారి కుటుంబాల నుంచి వ్యక్తవుతోంది.
 
 మా కుటుంబం వీధిన పడింది
 ‘‘ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో వైద్యం, ఇతరత్రా అవసరాలకు రూ.రెండు లక్షలకు పైగా ఖర్చయ్యింది. డబ్బు లేక అప్పులు చేయాల్సి వచ్చింది. నా భర్త చనిపోవడంతో మా కుటుంబం వీధిన పడింది. మా కుమార్తె జాహ్నవి సీఏ చేయడానికి సిద్ధమవుతోంది. కుమారుడు దీపక్‌ను ఇంటర్మీడియట్‌లో చేర్చా ల్సి ఉంది. అవయవదానం చేసినందుకు మేము డబ్బులు ఆశించడం లేదు. ఆరు కుటుంబాలకు మేలు జరిగిందనే సంతృప్తి మిగిలింది. అవయవదానం చేసిన నిరుపేదల ఆసుపత్రి బిల్లులైనా ప్రభుత్వం చెల్లించగలిగితే మాలాంటి వారు ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. తద్వారా అవయవదానం చేయడానికి నిరుపేద కుటుంబాలు ముందుకొస్తాయి’’
 - నాగమణి, అవయవ దాత ఏడుకొండలు భార్య

మరిన్ని వార్తలు