ఆధార్‌ ఉంటేనే భోజనం

6 Mar, 2017 01:46 IST|Sakshi
ఆధార్‌ ఉంటేనే భోజనం

మధ్యాహ్న భోజన పథకం అమలులో పారదర్శకత
పాఠశాలలకు త్వరలోనే నోటిఫికేషన్‌
వంట చేసే కార్మికులూ వివరాలు ఇవ్వాల్సిందే..
కార్డులు లేని వారికి జూన్‌ 30వరకు గడువు
జిల్లాలో 45,521 మంది విద్యార్థులు, 1,209 మంది కార్మికులు


వరంగల్‌ రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో కేంద్రప్రభుత్వం కొత్త నిబంధన చేర్చనుంది. ఈ పథకంలో భాగంగా భోజనం చేసే విద్యార్థులే కాకుండా వంట చేసే కార్మికుల ఆధార్‌ కార్డు వివరాలు సేకరించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ శాఖ ఆధీనంలోని ‘ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లిటరసీ’ ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ త్వరలోనే పాఠశాలలకు పంపించనుంది.

నిధుల వినియోగంలో పారదర్శకత
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండొద్దన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్నేళ్లుగా అమలుచేస్తున్నాయి. అయితే, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులు, బియ్యాన్ని అందజేస్తాయి. ఈ మేరకు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను తప్పుగా చూపిస్తూ నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పథకం నిర్వహణలో పారదర్శకత కోసం విద్యార్థులు, వంట కార్మికుల ఆధార్‌ కార్డుల నంబర్లు సేకరించాలని నిర్ణయించింది. విద్యార్థులు భోజనం చేస్తున్నందున.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నందున కార్మికుల నంబర్లు కూడా సేకరించనున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆధార్‌ కార్డులు లేని వారు జూన్‌ నెల 30వ తేదీలోగా పొందేందుకు గడువు ఇస్తారు.

జిల్లాలో 45,521మంది విద్యార్థులు
వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని  15 మండలాలకు చెందిన 694 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతోంది. ఇందులో 472 ప్రాథమిక పాఠశాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలలు, 141 జిల్లా పరిషత్‌ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 45,521 మంది విద్యార్థులు ఉండగా, 1,209 మంది వంట కార్మికులు పని చేస్తున్నారు. వంట చేసే వర్కర్లకు నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రతినెలా మొత్తం రూ.1,20,900 చెల్లిస్తున్నారు. అలాగే, విద్యార్థుల ఆహారానికి సంబంధించి రోజుకు రూ.3,25,021, నెలకు రూ.78,00,507 ఖర్చు అవుతోంది.

మరిన్ని వార్తలు