‘టెన్త్’కు ఆధార్ తప్పనిసరి కాదు

1 Dec, 2015 01:45 IST|Sakshi
‘టెన్త్’కు ఆధార్ తప్పనిసరి కాదు

సాక్షి, హైదరాబాద్:  పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆధార్ నంబరు తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ నంబరు లేకున్నా విద్యార్థుల నామినల్ రోల్స్ తీసుకోవాలని, విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని పేర్కొంది. పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆధార్ నంబరు ఉంటేనే వారి నామినల్ రోల్స్ తీసుకోవాలని ఇటీవల విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఆధార్ తప్పనిసరి అన్న నిబంధనను తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆధార్ లేకపోయినా పరీక్షలకు అనుమతించాలని స్పష్టం చేశారు. దీనిపై జిల్లాల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌కు సూచించారు.

అలాగే ఈ అంశంపై విద్యాశాఖ కూడా వివరణతో కూడిన ప్రకటన జారీ చేసింది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేయించుకోవాలని పేర్కొంది. పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్, ఐసీఆర్ ఓఎంఆర్ పత్రాల సమర ్పణకు, ఆన్‌లైన్‌లో డాటా నమోదుకు ఆధార్ నంబరుకు సంబంధం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 5 నుంచి 17 ఏళ్ల వయసున్న విద్యార్థులంతా ఆధార్ నమోదు చేయించుకోవాలని వెల్లడించింది.
 
 ఆధార్ నమోదు చేయించుకోండి..
 విద్యార్థులు ఎవరికైనా ఆధార్ నంబరు లేకపోతే నమోదు చేయించుకోవాలని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల కోసమే ప్రతి జిల్లాలో 10కి పైగా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పాఠశాలల యాజమాన్యాలు పిల్లలు ఆధార్ నమోదు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు