ఎంపీ సమక్షంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట!

9 Sep, 2015 19:44 IST|Sakshi
ఎంపీ సమక్షంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట!

చీరాల : వికలాంగులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పచ్చ తమ్ముళ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎంపీ మాల్యాద్రి సమక్షంలో రెండు వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు తున్నులాటకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రాండ్లో బుధవారం జరిగింది. బాపట్ల ఎంపీ మాల్యాద్రి సమక్షంలోనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత వర్గీయుల మధ్య వివాదం చెలరేగడం గమనార్హం. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వారం రోజుల కిందటే టీడీపీలో చేరిన విషయం విదితమే. అయితే ఆమంచి చేరికను పోతుల సునీత వర్గీయులు వ్యతిరేకించినప్పటికీ, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆమంచిని పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తయారయ్యాయి.

బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఎమ్మెల్యేని వేదికపైకి ఆహ్వానించగా, దీన్ని సునీత వర్గం వ్యతిరేకించింది. దీంతో పరిస్థితి అదుపుతప్పి, ఇరువర్గీయుల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అంతటితో ఆగకుండా ఒకవర్గంపై మరోవర్గం వారు కుర్చీలు విసురుకుని కార్యక్రమాన్ని రసాభాసగా మార్చేశారు. ఇరువర్గాల కార్యకర్తలకు గాయాలయినట్లు తెలుస్తోంది.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినిట్లు పోలీసులు తెలిపారు. పోతుల సునీత, ఆమంచి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

మరిన్ని వార్తలు