గ్యారేజీ పాలైన ‘ఆరాధన’

28 Jul, 2016 00:38 IST|Sakshi
l మూటల్లో మూలుగుతున్న 3 వేల సంచికలు
l అన్నవరం దేవస్థానం సిబ్బంది నిర్వాకం
అన్నవరం : దేవాదాయ శాఖ 2015 జూలైలో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కథనాలతో ప్రచురించిన ‘ఆరాధన’ ప్రత్యేక సంచిక ప్రతులు దేవస్థానం కారు గ్యారేజీలో పడి ఉన్నాయి. ఏకంగా 30 బస్తాలలో మూడువేల పుస్తకాలను మూటలు కట్టి ఎందుకూ పనికిరాని పుస్తకాలలా మూలన పడేశారు.  దేవాదాయశాఖ ప్రతి నెలా ‘ఆరాధన’ ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రచురిస్తుంది. ఒక్కో సంచిక వెల రూ.25 కాగాఅన్నవరం దేవస్థానానికి ప్రతినెలా ఐదు వేల ప్రతులు పంపిస్తారు. ప్రతి నెలా వచ్చే పుస్తకాలను దేవస్థానం రూ.1,500 వ్రతాలు చేయించుకునే భక్తులకు, నిత్యకల్యాణం భక్తులకు ఉచితంగా ఇచ్చి. మిగిలిన ప్రతుల్ని విక్రయిస్తోంది. ప్రతి నెలా ఎన్నో కొన్ని పుస్తకాలు మిగిలిపోతున్నా వాటితో నిమిత్తం లేకుండా దేవస్థానానికి పంపించిన మొత్తం పుస్తకాలకు సొమ్ము చెల్లిస్తున్నారు. కాగా, 2015 జూలైలో పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు, కమిషనర్‌ అనూరాధ సందేశాలతో, గోదావరి జిల్లాల్లోని ఆలయాల వివరాలతో రూపొందించిన ఆ సంచిక ప్రతులను గ్యారేజీకి తరలించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంత్య పుష్కరాల్లో పంపిణీ: ఈఓ 
కాగా ఆరాధన ప్రత్యేక సంచికలు దేవస్థానానికి పంపించినవి కాదని, పుష్కరాల్లో రాజమండ్రిలో  విక్రయించగా మిగిలిన వాటిని గత ఆగస్టులో దేవస్థానానికి పంపివిక్రయించమన్నారని ఈఓ నాగేశ్వరరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. అప్పటికే ఆగస్టు నెల ఆరాధన మార్కెట్‌లోకి రావడంతో ఈ పుస్తకాలను ఎవరూ కొనలేదని, ఈ పుస్తకాలకు దేవస్థానం నగదు చెల్లించలేదని వివరించారు. ఈ నెల 31న ప్రారంభం కానున్న అంత్యపుష్కరాలలో సత్యదేవుని ఆలయానికి వచ్చే  భక్తులకు వీటిని పంపిణీ చేయిస్తామన్నారు.
 
మరిన్ని వార్తలు