మంత్రి చందూలాల్‌ను అడ్డుకున్న ఆశ వర్కర్లు

27 Nov, 2015 01:52 IST|Sakshi
మంత్రి చందూలాల్‌ను అడ్డుకున్న ఆశ వర్కర్లు

కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర  ప్రభుత్వమే జీతాలివ్వాలని డిమాండ్
ములుగు : వరంగల్ జిల్లా ములుగు డివిజన్ కేంద్రంలో గురువారం ఆశ కార్యకర్తలు రాష్ట్ర మంత్రి చందూలాల్‌ను అడ్డుకున్నారు. 85 రోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యల పరిష్కారంపై స్పందించడం లేదని మంత్రి ఎదుట నిరసన తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి గురువారం ములుగులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తన స్వగ్రామమైన జగ్గన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని సారంగపల్లికి బయలుదేరారు.

అప్పటికే డివిజన్‌లోని 13 మండలాల ఆశ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న వారు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆశ కార్యకర్తలకు జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయూన్ని గమనించిన పోలీసులు.. సీఐటీయూ, ఆశ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించగా తోపులాట జరిగింది.

అనంతరం స్పందించిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తల సమస్య కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని అన్నారు. ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకరిస్తానని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప  ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న వారి మాటలు విని ఆగం కావద్దని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రత్నం రాజేందర్, సీపీఎం డివిజన్ కార్యదర్శి అమ్జద్‌పాషా, ఆశ కార్యకర్తలు పాల్కొన్నారు.

మరిన్ని వార్తలు