ఏబీవీపీ బంద్‌ ఉద్రిక్తం

26 Jul, 2016 22:38 IST|Sakshi
ఏబీవీపీ బంద్‌ ఉద్రిక్తం

– ప్రియదర్శిని కళాశాలలో కరస్పాండెంట్, ఏబీవీపీ నాయకుల ఘర్షణ
–హుజూర్‌నగర్‌లో ఘటన
హుజూర్‌నగర్‌
 విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ పట్టణంలో ఉద్రిక్తంగా మారింది. ఏబీవీపీ నాయకులు కళాశాలలను బంద్‌ చేయించే క్రమంలో స్థానిక ప్రియదర్శినీ జూనియర్‌ కళాశాలలో కరస్పాండెంట్‌ పశ్య శ్రీనివాసరెడ్డి, ఏబీవీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.కళాశాలను బంద్‌ చేయాలని ఏబీవీపీ నాయకులు కరస్పాండెంట్‌ను కోరగా అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన ఏబీవీపీ నాయకులు కళాశాలలోకి ప్రవేశించి బంద్‌కు సహకరించాలని విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు బయటకు వస్తున్న విషయం తెలుసుకున్న కరస్పాండెంట్‌ అక్కడకు వచ్చి విద్యార్థులను తరగతి గదుల్లోకి వెళ్లాలని ఆదేశించారు. అంతేగాక ఏబీవీపీ నాయకులను కళాశాల నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అధ్యాపకులు ఘర్షణను నివారించగా ఏబీవీపీ నాయకులు కళాశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్‌ అనంతు కరుణాకర్‌ మాట్లాడుతూ విద్యా సంస్థల బంద్‌కు సహకరించాలని తాము కోరగా  కరస్పాండెంట్‌ శ్రీనివాసరెడ్డి మాపై కర్రలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
కరస్పాండెంట్‌ వివరణ
కళాశాలలు బంద్‌ చేయాలంటూ పదే పదే రావద్దని, ఈ ఒక్కసారి మాత్రమే బంద్‌ చేస్తామని అందుకు అంగీకరిస్తూ హామీ పత్రం రాసిస్తే వారికి సహకరిస్తానని చెప్పాను. అందుకు వారు నిరాకరిస్తూ కళాశాలలోకి వెళ్లి విద్యార్థులను బయటకు పంపించారు. దీంతో పాటు తాగునీటి కుండను పగులకొట్టడంతోనే వారిని కళాశాల నుంచి బయటకు పంపాన్నారు. ఏబీవీపీ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 

మరిన్ని వార్తలు