ఏసీబీ వలలో ’వాణిజ్య శాఖ’ జలగలు

17 Dec, 2016 00:03 IST|Sakshi
ఏసీబీ వలలో ’వాణిజ్య శాఖ’ జలగలు
లంచం తీసుకుంటూ చిక్కిన ఏసీటీవో, సీనియర్‌ అసిస్టెంట్‌  
ఏలూరు అర్బన్‌: ఏసీబీ అధికారుల వలకు ఏలూరు ఏసీటీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు చిక్కారు. బాధితుల ఫిర్యాదు మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని వాణిజ్యపన్నుల విభాగంలో ప్రత్యేక ఏసీటీవోగా పనిచేస్తున్న ఎండీ మస్తాన్, అదే కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జీవీవీ ఫణికుమార్‌ ఈనెల 14న హనుమాన్‌ జంక‌్షన్‌ సమీపంలోని చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి భీమవరం వెళుతున్న మూడు తవుడు లారీలను ఆపారు. రికార్డులు పరిశీలించి తవుడు అక్రమంగా తరలిస్తున్నారంటూ లారీల యజమాని (లక్ష్మీ గణపతి లారీ ట్రాన్స్‌పోర్ట్, గుడివాడ) యార్లగడ్డ సతీష్‌ని రూ.1.50 లక్షలు అపరాధ రుసుం చెల్లించాలని బెదిరించారు. తాము చేపల మేత కోసం తవుడు తరలిస్తున్నామని, దీనికి ఎలాంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదని సతీష్‌ చెప్పినా వినిపించుకోలేదు. ఇతర వ్యాపార అవసరాలకోసం తవుడు తరలిస్తున్నారని కేసు పెడతామని సతీష్‌ను బెదిరించారు. రూ.60 వేలు లంచం ఇస్తే కేసు లేకుండా చేస్తామని డిమాండ్‌ చేసి చివరకు రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నోట్ల రద్దు కారణంగా అంత సొమ్ము తన వద్దలేదని కొంత గడువు కావాలని సతీష్‌ వారిని కోరాడు. గడువు ఇచ్చిన ఏసీటీవో మస్తాన్‌ హామీగా సతీష్‌ నుంచి రూ.40 వేలకు చెక్‌ తీసుకున్నారు. దీంతో సతీష్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణకు ఫిర్యాదు చేయడంతో వలపన్నిన అ«ధికారులు గడువు మేరకు శుక్రవారం సతీష్‌కు రూ.40 వేల విలువైన కొత్త కరెన్సీ నోట్లు ఇచ్చి ఏలూరు ఏసీటీవో కార్యాలయానికి పంపారు. ఏసీటీవో మస్తాన్, సీనియర్‌ అసిస్టెంట్‌ ఫణికుమార్‌ వాహన యజమాని సతీష్‌ నుంచి లంచం తీసుకుంటూండగా డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ యు.విల్సన్‌ దాడి చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మస్తాన్, ఫణికుమార్‌ను ఏసీబీ కోర్టుకు తరలించారు.
 
మరిన్ని వార్తలు