ఏసీబీకి చిక్కిన వీఆర్వో

18 Oct, 2016 01:32 IST|Sakshi
కనగానపల్లి : అవినీతి డబ్బుకు ఆశపడిన ఓ గ్రామ రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల చిక్కాడు. వివరాలిలా ఉన్నాయి. కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ రెవెన్యూ అధికారిగా తలారి చన్నయ్య పనిచేస్తున్నాడు. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని కొండపల్లికి చెందిన బండి వెంకటరాముడు తన నలుగురు అన్నదమ్ములతో కలిసి 2015 డిశంబర్‌లో ఈ పాస్‌ పుస్తకాల కోసం దరఖాస్తు చేశాడు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వం 2016, ఏప్రిల్‌లో మంజూరు చేసింది. తహశీల్దార్‌ కార్యాలయానికి చేరిన ఈ పుస్తకాలను ఇవ్వడానికి సదరు వీఆర్వో ఐదు నెలలుగా రైతుల్ని తిప్పుకుంటున్నాడు. చివరకు ఒక్కో పాసుపుస్తకానికి రూ.రెండు వేలు చొప్పున నాలుగింటికి రూ.8000 ఇవ్వాలని వీఆర్వో వారిని డిమాండ్‌ చేశాడు. దీంతో అంత డబ్బు ఇవ్వలేక రైతు బండి వెంకటరాముడు శనివారం అనంతపురంలో ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. దీనిపై ఏసీబీ డీఎస్సీ భాస్కరరెడ్డి విచారణ చేసి సోమవారం తన సిబ్బందితో కలిసి కనగానపల్లి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంలో మధ్యాహ్నం 12.45 సమయంలో వీఆర్వో అడిగిన మేరకు సంబంధిత రైతు ద్వారా రూ.7,500 ఇప్పించారు. అనంతరం ఏసీబీ అధికారులతో కలిసి వచ్చిన మధ్యవర్తులు సురేష్‌కుమార్, షరీఫ్‌ ద్వారా వీఆర్వో  చెన్నయ్య తీసుకున్న లంచం డబ్బును గుర్తించి ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అనంతరం పట్టుబడిన వీర్వోను ఏసీబీ అధికారులు గంట పాటు విచారణ జరిపి కేసు నమోదు చేశారు. తర్వాత అతడ్ని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.   ఏసీబీ సీఐ ఖాదర్‌బాషా, సిబ్బంది, స్థానిక పోలీసులు  పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు