విశాఖలో సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

31 Dec, 2015 10:08 IST|Sakshi

విశాఖపట్టణం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ మధురపూడి సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచాలు తీసుకోవటంతోపాటు టీడీపీ నేతలు, రౌడీ షీటర్లతో దగ్గరి సంబంధాలు నెరపుతున్నట్లు ఆనంద్‌కుమార్‌పై ఆరోపణలున్నాయి. దీంతో లాసన్స్‌బేలో ఉన్న ఆయన ఇంటికి సోమవారం ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లగా అంతకుమునుపే సమాచారం అందుకున్న సబ్‌రిజిస్ట్రార్ ఆనంద్‌కుమార్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

మూడు రోజులపాటు వేచి చూసిన అధికారులు గురువారం ఇంటి తాళం పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో హైదరాబాద్‌తోపాటు పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లోని 10 చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది. ఆయన కుటుంబసభ్యుల, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించి ఇప్పటికే రూ.1.60 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే ఈ సోదాల్లో సుమారు 10 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్టు సమాచారం. కాగా, డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు