కొరడా

29 Mar, 2016 02:09 IST|Sakshi
కొరడా

రైసు మిల్లులపై దాడులు
రేషన్ బియ్యం కొనుగోళ్లపై తనిఖీలు
మూడు బృందాల విచారణ

 పెద్దశంకరంపేట:  పీడీఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో జిల్లా అధికారులు పేటలోని మూడు రైసుమిల్లులపై గత రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు రేషన్ బియ్యం సరఫరాపై విచారణ చేపడుతున్నారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి  గండికొడుతున్నారనే సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అనుమానం వచ్చిన మిల్లులపై జిల్లా స్థాయి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ రూ.కోట్లు గడిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న పేట మండలంలోని మూడు రైసుమిల్లులపై ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నుంచి మూడు రైసుమిల్లుల్లో బస్తాలను అధికారులు లెక్కించారు. ఇతర రాష్ట్రాలనుంచి  బియ్యం ఎగుమతిదిగుమతులవుతున్నాయని పలువురు పిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో జేసీ ఆదేశాల మేరకు రైసుమిల్లుల్లో అధికారులు సోదా నిర్వహించారు.

సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్‌లకు చెందిన తహశీల్దార్లు, సిద్దిపేట, సంగారెడ్డికి చెందిన ఏఎస్‌ఓల బృందం తనిఖీలు చేపట్టింది. గత అరు నెలల విద్యుత్ వాడకంపై కూడా అధికారులు విద్యుత్ శాఖ ఏఈ ద్వారా సమాచారం సేకరించారు. మిల్లర్లు వాడిన విద్యుత్, మర పట్టిన ధాన్యానికి గల తేడాలను అధికారులు గుర్తించారు. అధికారులు దాడులు చేయవచ్చనే సమాచారంతో ముందుగానే పీడీఎస్ బియ్యం లేకుండా మిల్లర్లు జాగ్రత్త పడినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు