మెరైన్ సీఐ అక్రమాస్తులు రూ.16 కోట్లు

18 Feb, 2016 02:05 IST|Sakshi
మెరైన్ సీఐ అక్రమాస్తులు రూ.16 కోట్లు

 ఏసీబీ దాడుల్లో బట్టబయలు
 
 సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పూడిమడక మెరైన్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న హుస్సేన్ ఆదాయానికి మించి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఈ విషయం బట్టబయలైంది. అధికారుల కథనం ప్రకారం.. బుధవారం విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయనగరం, ముంబైల్లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. రాత్రి వరకు కొనసాగిన సోదాల్లో బంగారం, నగదుతోపాటు కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఇంతవరకు అందిన సమాచారం మేరకు హుస్సేన్ ఆదాయానికి మించి రూ.1.5 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించారు.

వాటి మార్కెట్ విలువ సుమారు రూ.16 కోట్లు ఉంటుందని అంచనా. విశ్వసనీయంగా అందిన సమాచారంతో హుస్సేన్ నివసిస్తున్న స్థానిక పాత సీబీఐ కార్యాలయ సమీపంలో సాయిసదన్ అపార్ట్‌మెంట్‌పై ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తన సిబ్బందితో దాడి చేసి సోదాలు నిర్వహించారు. బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ సిమ్స్ మోసం కేసులో హుస్సేన్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిమ్స్ బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు.. సీఐ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి దాడులకు పూనుకున్నారు.

మరిన్ని వార్తలు