జీడీకే –11 గనిలో ప్రమాదం

17 Jan, 2017 22:18 IST|Sakshi
జీడీకే –11 గనిలో ప్రమాదం

► ముగ్గురు కార్మికులకు తీవ్రంగా.. నలుగురికి స్వల్పంగా గాయలు
► ఘటనకు ఎయిర్‌బ్లాస్టింగే కారణం


గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): రామగుండం రీజియన్‌ పరిధిలోని జీడీకే –11 గనిలో సోమవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా, మరో నలుగురు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. గనిలోని 1వ సీమ్‌ కంటిన్యూయస్‌ మైనర్‌ డిస్ట్రిక్ట్‌ 43వ లెవల్‌లో డిప్‌ వద్ద రామ్‌కార్‌లో సిమెంట్‌ ఇటుకలు, ఇసుకను తీసుకుని వచ్చి నిర్మాణం చేస్తున్న సమయంలో సుమారు 650 మీటర్ల దూరంలోని 56వ లెవల్‌లో ఒక్కసారిగా బండ, బొగ్గుతో కూడిన పైకప్పు కుప్పకూలింది. దీంతో అక్కడి నుంచి గాలి వేగంగా ఇతర డిస్ట్రిక్ట్‌లకు వ్యాపించగా...43వ లెవల్‌లో పనిచేస్తున్న కార్మికులు ఆ గాలికి ఎగిరి కిందపడ్డారు.

కొందరు దూరంగా వెళ్లి రైలు పట్టాలపై పడగా...మరికొందరు బొగ్గు కుప్పలపై పడ్డారు. ఈ ఘటనలో మజ్దూర్‌ కార్మికుడు కె.సమ్మయ్య ఎడమ కాలుకు, ఛాతిభాగంలో గాయాలయ్యాయి. అలాగే యాక్టింగ్‌ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ హరీష్‌ అనే జేఎంఈటీకి నడుము భాగంలో చర్మం ఊడిపోయింది. ఎల్‌ సత్యనారాయణ అనే జనరల్‌ మజ్దూర్‌కు ఎడమ చేయి విరిగింది. కాగా ఆర్‌.శంకర్, జి.రాజేశం, చొప్పరి రామారావు, రమేష్‌ అనే కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేదు : కార్మిక సంఘాలు
యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని, అందుకే గనుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివిధ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ఆరోపించారు. సోమవారం జీడీకే –11 గనిలో జరిగిన ప్రమాద బాధితులను టీబీజీకేఎస్‌ ఆర్జీ–1 ఉపాధ్యక్షుడు ఆరెల్లి పోషం, గండ్ర దామోదర్‌రావు, పంచాల తిరుపతి, వడ్డేపల్లి శంకర్, జంగ కనకయ్య, రమేష్‌ రెడ్డి, పిల్లి రమేష్, హెచ్‌ఎంఎస్‌ ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌ అహ్మద్, నాయిని ఓదెలు, కాట వీరయ్య, ఎలగందుల మల్లేశ్, ఐఎన్‌టీయూసీ కార్యదర్శి పి.ధర్మపురి,  జీఎల్‌బీకేఎస్‌ నాయకులు ఇ.నరేష్, బి.అశోక్, మల్యాల దుర్గయ్య, గుండేటి మల్లేశ్, తదితరులు పరామర్శించారు.

కాగా ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి కెంగెర్ల మల్లయ్య, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఏఐటీయూసీ అధ్యక్షులు వై.గట్టయ్య, ఇప్టూ రాష్ట్ర నాయకులు కె.విశ్వనాథ్, తదితరులు డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు