శ్రీశైలం ఘాట్‌లో ప్రమాదం

23 Jan, 2017 21:37 IST|Sakshi
శ్రీశైలం ఘాట్‌లో ప్రమాదం
- తుఫాన్‌ వాహనం బోల్తా
- ఆరుగురికి తీవ్ర గాయాలు
- వారిలో ఇద్దరి పరిస్థితి విషమం
  
పెద్ద దోర్నాల: ప్రయాణికులతో వెళ్తున్న తుఫాన్‌ వాహనం బోల్తా పడటంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో బోడేనాయక్‌ తండా సమీపంలో సోమవారం జరిగింది. క్షతగాత్రుల్లో డోన్‌ మండలం హసనాపురానికి చెందిన హేమారెడ్డి, అవుకు మండలం చెర్లోపల్లికు చెందిన తుఫాన్‌ డ్రైవర్‌ కొట్టం వెంకటయ్య, పత్తికొండ మండలం పులికొండకు చెందిన దంపతులు నార్ల తిప్పయ్య, అనసూయమ్మ, ఆమె సోదరి నార్ల నరసమ్మ, తిప్పనూరు మండలం గోనెంట్లకు చెందిన నాగేంద్ర ఉన్నారు.
 
ప్రమాదంలో నార్ల తిప్పయ్య ఆరేళ్ల కుమార్తె వనజకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఇతర వాహనాల డ్రైవర్లు క్షతగాత్రుల్లో కొందరిని తమ వాహనాల్లో పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మిగిలిన క్షతగాత్రులను 108 సిబ్బంది వైద్యశాలకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హేమారెడ్డి, కొట్టం వెంకటయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం, కర్నూలు వైద్యశాలలకు తరలించారు.
మరిన్ని వార్తలు