మరణంలోనూ తోడుగా..

21 Apr, 2016 22:09 IST|Sakshi

పుంగనూరు: వారు ఇద్దరూ పెళ్లినాడు చేసుకున్న బాసలు మరిచిపోలేదు. కష్టంలోనూ, సుఖంలోనూ కలిసిమెలసి జీవించారు. ఎంతో అన్యోన్యమైన వారి దాంపత్యాన్ని చూసి విధి కన్నుకుట్టినట్టుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన భార్యాభర్తలను నీటి కుంట రూపంలో బలితీసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లెలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

పుంగనూరు మండలం వేపమాకులపల్లెకు చెందిన గంగులప్ప(70), మునెమ్మ(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మునెమ్మ గురువారం సాయంత్రం బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని కుంట వద్దకు వెళ్లింది. భర్త కూడా వెళ్లాడు. బట్టలు ఉతుకుతూ మునెమ్మ కాలుజారి నీటిలో మునిగిపోయింది. గమనించిన గంగులప్ప వెంటనే భార్యను కాపాడేందుకు ప్రయత్నించి నీటిలో మునిగిపోయాడు.

గ్రామస్తులు గమనించి వెంటనే వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

>
మరిన్ని వార్తలు