ఖాతా ఓపెన్ చేసి.. డబ్బులు డ్రా..!

10 Nov, 2015 03:14 IST|Sakshi
ఖాతా ఓపెన్ చేసి.. డబ్బులు డ్రా..!

ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో జిల్లా ఇంధన వనరుల శాఖ పేరుతో ఖాతాను తెరిచి తర్వాత దానిలోకి రూ. కోట్లు వచ్చి చేరాయి. తర్వాత పెద్ద మొత్తంలో డ్రా అయ్యాయి. అయితే తమకు తెలియకుండానే ఖాతా ఓపెన్ అరుు్యందని జిల్లా ఇంధన వనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  ఈ వ్యవహారంపై విచారణ కోసం ఆ శాఖ ఎండీ కమలాకర్‌బాబు సోమవారం హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కమిటీని నియమించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని కవిరాజ్‌నగర్‌లో తెలంగాణ నూతన-పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంఘం లిమిటెడ్‌తో కార్యాలయం ఉంది.

ఈ కార్యాలయం పేరుతో ఈ నెల 2న మమత ఆస్పత్రిరోడ్డులోని ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి చెక్‌బుక్ అందింది. తమ కార్యాలయానికి సంబంధించిన ఖాతా లేకుండానే చెక్ బుక్ రావడంతో అధికారులు కంగుతిన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులను కలవడంతో బ్యాంకు టార్గెట్ కోసం ఖాతాను ఓపెన్ చేశామని, ఈ ఖాతాను కూడా క్లోజ్ చేశామని తప్పుడు స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లు తెలిసింది.

 రూ. కోట్లు జమ..
 ఈ ఏడాది మే 18న ఈ కార్యాలయం పేరుతో  మేరుగు శ్రీనివాసరావు, బి.భగవాన్‌దాస్ పేర్లతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఆ ఖాతాలోకి సుమారు రూ.10,67,87,000 జమ అయ్యాయి. జమ అయిన మొత్తం నుంచి రూ.కోటి వరకు డిపాజిట్ చేయగా, మిగిలిన వాటిలో రూ.9.61 కోట్ల వరకు ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. రూ.6.83లక్షలు బ్యాంకు ఖాతాలో నిల్వ ఉన్నాయి. అయినా, తప్పుడు పేర్లతో, తమ కార్యాలయం పేరుతో ఖాతా ఓపెన్ అవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు, పోలీసులకు జిల్లా ఇంధన వనరుల శాఖ కార్యాలయ అధికారులు ఈనెల మొదటి వారంలో ఫిర్యాదు చేశారు.

 బ్యాంకు అధికారుల హస్తం ఉందా..?
 కార్యాలయ అధికారులకు తెలియకుండా, కనీసం కార్యాలయం నుంచి లేఖ కూడా లేకుండా తప్పుడు పత్రాలతో ఖాతా తెరవడం.. ఆ ఖాతాలోకి కోట్లాది రూపాయలు వచ్చి చేరడంలో బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంధన వనరుల శాఖాధికారులు తొలు త బ్యాంకులో సంప్రదించినప్పుడు టార్గెట్ కోసం సెప్టెంబర్ 29న తెరచి, అక్టోబర్ 2న రద్దు చేసినట్లు చెప్పడం కూడా అనుమానాలు తావి స్తోంది.  

 మరో మూడు రోజుల్లో విచారణ
 ఇంధన వనరులశాఖ కార్యాలయం పేరుతో కోట్లాది రూపాయలు జమ, డ్రా అయిన అంశంపై మూడురోజుల్లో ముగ్గురు అధికారులు ఖమ్మంలోని ఆ బ్యాంకులో విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై జిల్లా నెడ్‌క్యాప్ మేనేజర్, ఏజీ ఆడిట్ అధికారిని, నెడ్‌క్యాప్ హెడాఫీస్ నుంచి ఓ అధికారిని విచారణాధికారులుగా నియమించారు.

 కోర్టు అనుమతి కోసం లేఖ: సీఐ శ్రీధర్
 తమ పేరుతో ఖాతా తెరిచిన విషయంపై జిల్లా ఇంధన వనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశా రు. అయితే దీనిపై కేసు నమోదు చేయడానికి అనుమతి కోరుతూ కోర్టుకు నివేదించాం. అనుమతి రాగానే కేసు నమోదు చేస్తాం. లేకుంటే నిధులు దుర్వినియోగం అయ్యాయని బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారా ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు చేస్తాం. 

>
మరిన్ని వార్తలు