నిందితుడు గోపాలకృష్ణ కోర్టుకు తరలింపు

25 May, 2016 12:14 IST|Sakshi

చాగల్లు: చాగల్లు మండలం నందిగంపాడుకు చెందిన యువకుడిని హత్య చేసిన కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకరైన మారిశెట్టి గోపాలకృష్ణను పోలీసులు మంగళవారం నిడదవోలు కోర్టుకు తరలించారు. కోర్టు గోపాలకృష్ణకు 15 రోజుల రిమాండ్ విధించినట్టు నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ తెలిపారు.

నిందితుడు గోపాలకృష్ణను తమకు అప్పగించాలంటూ సోమవారం చాగల్లు పోలీస్‌స్టేషన్ వద్ద మృతుడి బంధువులు తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో కోర్టుకు తరలింపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అస్తికోసం నందిగంపాడు గ్రామానికి చెందిన సొంత బావమరిదైన ఆత్కూరి రాజసాయి మణికంఠపై హత్యాయత్నం చేయడంతో పాటు మణికంఠ పెదనాన్న కొడుకైన ఆత్కూరి రాజేష్‌ను హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఊనగట్లకు చెందిన మారిశెట్టి వెంకటరత్నంతో పాటు అతని తమ్ముడు గోపాలకృష్ణను నిందితులుగా పోలీసులు గుర్తించారు. సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తును పోలీసులు కూడా వేగవంతం చేశారు.

 పోలీసుల అదుపులో వెంకటరత్నం?
 ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మారిశెట్టి వెంకటరత్నం పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిడదవోలు సర్కిల్ ఫరిధిలో ఓ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని విభిన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. వెంకటరత్నంను బుధ, గురువారాల్లో కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
రెండు గ్రామాల్లో పోలీస్ గస్తీ
 ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నందిగంపాడు, ఊనగట్ల గ్రామాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం చాగల్లు పోలీస్‌స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రాజేష్ మృతదేహానికి నందిగంపాడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐ బాలకృష్ణ గ్రామం వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

మరిన్ని వార్తలు