నింగికెగిసిన సాహితీశిఖరం

13 Jun, 2017 02:35 IST|Sakshi
నింగికెగిసిన సాహితీశిఖరం

సాక్షి, కరీంనగర్‌: సాహితీ దిగ్గజం, అలుపెరుగని అక్షర యోధుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి కరీంనగర్‌ జిల్లాకు (ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల జిల్లా) చెందినవారు. 29 జూలై 1931న బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. ఆయన భార్య సుశీలమ్మ. కూతుళ్లు గంగ, యమున, సరస్వతి, కష్ణవేణి. సాహిత్యమే సర్వస్వమనీ.. తన జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేసిన మహానుభావుడు. సినారే 3వ తరగతి వరకు హన్మాజీపేటలో 4 నుంచి 7 వరకు సిరిసిల్లలో, 8 నుంచి 10 వరకు కరీంనగర్‌ ప్రభుత్వ పురాత న పాఠశాలలో విద్యనభ్యసించారు.

1949లో ఇంటర్‌ హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో పూర్తి చేశారు. 1952లో ఉస్మానియా విశ్వవిద్యాల యం నుంచి బీఏ, 1954లో ఎంఏ, 1962లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1976 నుంచి 1981 వరకు ప్రొఫెసర్‌గా సేవలందించారు. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా, భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖ సలహాదారులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా సేవలందించారు. సాహితీవేత్తగా కరీంనగర్‌ జిల్లాలో అనేక సాహిత్య సభలకు హాజరయ్యారు.

నింగికెగిసిన కెరటం
తెలంగాణ ఖ్యాతిని దశదిశలాచాటిన సినారె (86) సోమవారం కన్నుమూశారు. సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు నేలపై పాటల పూదోటను సేద్యం చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత భువి నుంచి దివికెగారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సినీ గేయ రచయితగా, మహావక్తగా, గజల్‌ కవిగా, గాయకుడిగా, తెలుగు భాషాధ్యాయనంతో, సాహిత్య బోధనలో, పరిశోధకుడిగా పేరు సంపాదించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. 1954–57లో సికింద్రాబాద్‌ అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ తెలుగు అధ్యాపకుడిగా తొలి ఉద్యోగం సాధించారు.

1958లో నిజాం కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. ఉద్యోగం చేస్తూనే ప్రఖ్యాత కవి దేవులపల్లి వెంకటకష్ణశాస్త్రి సూచనతో సినారె ఆధునికాంధ్ర కవిత్వము ‘సంప్రదాయములు ప్రయోగములు’ అనే అంశంపై ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయం సినారెకు డాక్టరేట్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ పరిశోధన పుస్తకరూపంలోకి వచ్చింది. ఇప్పటికీ ఆధునీ కాంధ్ర కవిత్వంలో సినారె గ్రంథమే ప్రామాణికం. 1963 రీడర్‌గా పదోన్నతి పొందారు.

సాహితీవనంలో ఆకాశమెత్తున
సినారె చిరుప్రాయం నుంచే జానపద కథలు, బుర్ర కథలు, నాటికలపై ఆసక్తిచూపేవారు. తెలుగు భాషపై సాధికారత సాధించిన సినారె 1953లో తొలిసారిగా ‘నవ్వని పువ్వు’ కావ్య రచన మొదలైంది. సాహిత్య సజనలో ఎన్నో ప్రక్రియలకు ఆయన ప్రాణంపోశారు. వైవిధ్యభరితమైన రచనలు చేశారు. పద్యం, గేయం, వచనకవిత, గద్యకతి, సినీ గీతాల రచయితగా, లలిత గీతాలు, సంగీత నృత్యగీతాలు, బుర్రకథలు, గజళ్లు, యాత్రస్మృతులు వంటి రచనలు చేశారు. అనువాద ప్రక్రియలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. సినారె కావ్యగానం ప్రత్యేకత సంతరించుకుంది. తెలుగు నేలపై ఆయన రాసిన సాహిత్యం విస్తరించింది.

‘కర్పూర వసంతరాయలు’, ‘నాగార్జునసాగరం’, ‘తెలుగుగజళ్లు’, ‘కావ్యగానాలు’, ప్రముఖంగా చెప్పవచ్చు. ‘విశ్వనాథనాయకుడు’, ‘రుతుచక్రం’, సినారెకు పేరుతెచ్చిన కావ్యాలు. 1959లో సంగీత రూపకాల సంకలనం, ‘వెన్నెలవాడ’, ‘దివ్వెలమువ్వలు’ వచన కవితాసంకలనం వెలువడ్డాయి. 1967లో నెహ్రూ కథను 14 అధ్యాయాల్లో జాతిరత్నం పేరుతో వెలువరించి అప్పటి ప్రధానికి అంకితమిచ్చారు. పలు సాహిత్య ప్రక్రియలు చేపట్టిన సినారె 1962లో సినీ గీతాల రచనను ప్రారంభించారు.

గులేభకావళి కథా సినిమాలో ‘నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని..’ అనే పాటతో ప్రారంభించి సుమారు నాలుగు వేలకు పైగా సినీ గీతాలు రచించారు. ‘గున్నమామిడీ కొమ్మమీదా.. పూలురెండున్నాయి..’, ‘పగలే వెన్నెలా.. జగమే ఊయలా..’, ‘వస్తాడు నారాజు ఈ రోజు..’, ‘అమ్మను మంచిన దైవం ఉన్నదా..’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’, ‘ఓ ముత్యాల కొమ్మ.. ఓ మురిపాల రెమ్మా...’, అరుంధతిలో ‘జేజమ్మా.. మాయమ్మా...’ అంటూ వచ్చిన పాటలన్నీ సినారె కలం నుండి జాలువారిన ఆణిముత్యాలే.

ఆదరణ పొందిన రచనలు
ఆదిమదశ నుంచి మానవుని పరిణామక్రమం.. ఇతివృత్తాన్ని వెలువరించిన గొప్ప కావ్యం ‘విశ్వంభర’. మనసుకు తొడుగు మనిషి మనిషికి ఉడుకు జగతి, ఇది విశ్వంభరాతత్వం, ఇదే అనంత జీవిత సత్యం అని సినారె సూత్రీకరించారు. 1980లో వెలువడిన విశ్వంభరకు ప్రతిష్టాత్మకమైన భారతీయ జ్ఞానపీఠ్‌ పురస్కారానికి 1988లో ఎంపికైంది. 1970లో అంతకుముందు విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవక్షానికి తెలుగురు తొలి జ్ఞానపీఠం రాగా సినారెది రెండవ జ్ఞానపీఠంగా గుర్తింపు పొందింది. నవ్వనిపువ్వు(1953), జలపాతం(1953), విశ్వగీతి(1954), అజంతాసుందరి(1955), నారాయణరెడ్డి గేయాలు(1955) తదితర 86 గ్రంథాలు, 18 ప్రక్రియల్లో సాహిత్య సృజన చేశారు.

ఇవీ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆదరణ పొందాయి. నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూరవసంతరాయలు, వెన్నెలవాడ, దివ్వెలమువ్వలు, విశ్వనాథనాయకుడు, రామప్ప, సమదర్శనం, రుతుచక్రం, అక్షరాలగవాక్షాలు, వ్యాసవాహిని, ఆధునికాంధ్ర కవి త్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు, జాతిరత్నం, మధ్యతరగతి మందహాసం, మరో హరి విల్లు.. ఇలా 1953 నుంచి 2014 వరకు ఆయన రాసిన నవలలు, కథాసంపుటిలు, పుస్తకాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. సోవియట్‌ యూనియన్‌లో మరోసారి, నడకనాతల్లి, కాలం అంచుమీద, ప్ర‘పంచ’పదులు, జ్వాలగా జీవిం చాలని, కొనగోటిమీద జీవితం, కలిసినడిచే కా లం ఇలా అనేక పుస్తకాలు ప్రజలపై ప్రభావం చూపాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు