’ఆక్వా’రిష్టం

25 Dec, 2016 21:36 IST|Sakshi
’ఆక్వా’రిష్టం
బరితెగిస్తున్న మాఫియా 
అన్నదాతకు తీరని నష్టం  
మామూళ్ల మత్తులో అధికారులు
జిల్లాలోని అన్నదాతలకు ’ఆక్వా’రిష్టం దాపురించింది. పచ్చని చేలు అక్రమార్కుల ధన దాహానికి చెరువులుగా మారిపోతున్నాయి. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులూ వంతపాడుతున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : 
ఆక్వా మాఫియా బరితెగిస్తోంది. అనుమతులు లేకుండానే వేలాది ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం సాగిస్తోంది. తర్వాత వాటిని రొయ్యల చెరువులుగా మార్చేస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గం  నిడమర్రు మండలంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వేలాది ఎకరాల్లో అక్రమంగా రొయ్యలసాగు జరుగుతోంది. వీటి నుంచి పంట కాలువల్లోకి విడుదలవుతున్న కాలుష్య నీరు పొలాలను ముంచెత్తుతోంది.  తాజాగా నిడమర్రు మండలంలోని అడవికొలనుతోపాటు పలుగ్రామాల్లో వేలాది ఎకరాల్లో రబీ నారుమళ్లు, నాట్లు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారంతా కౌలురైతులే. నారుమళ్ల కోసం ఆ రైతులు రూ.ఐదువేల నుంచి రూ.పదివేల వరకూ ఖర్చుచేశారు. ఈ ఖర్చంతా నీటిపాలైంది. పంట కాలువలూ పచ్చగా మారాయి. దీనిపై రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మత్య్సశాఖ ఉన్నతాధికారులు వచ్చి చూసి వెళ్లారు. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు ఉండటం వల్లే అక్రమార్కులను అధికారులు ఏం చేయలేకపోతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.  నిడమర్రు మండలంలో ఉన్నన్ని అనధికారిక చెరువులు జిల్లాలో ఎక్కడా లేవు. ప్రభుత్వ అన్‌ సర్వే భూములనూ చెరువుల్లో అక్రమార్కులు కలిపేసుకున్నట్టు సమాచారం.  అడవికొలనులో 85 సెంట్ల ప్రభుత్వ భూమినీ కలిపేసుకుని కొందరు చెరువులు తవ్వేసుకున్నారు. పెదనండ్రకొలను, అడవికొలను గ్రామాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేశారు. సాధారణంగా చేపల చెరువులకు  రెండు అనుమతులు ఉంటాయి. తాత్కాలిక అనుమతితో చెరువు తవ్వుకోవచ్చుగానీ, నీరు నింపే అవకాశం లేదు. శాశ్వత అనుమతి వస్తేనే చేపల పెంపకానికి అనుమతి ఉంటుంది. అయితే తాత్కాలిక అనుమతులతోనే అక్రమార్కులు చేపల చెరువులు తవ్వేసి వాటిని తర్వాత రొయ్యల చెరువులుగా  మార్చేస్తున్నారు. అసలు రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రభుత్వ అనుమతులు లేవు.  కానీ నిడమర్రు మండలంలో చేపల, రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతోంది. వీటిల్లో పట్టుబడి కోసం నీటిని వదిలివేయడంతో చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. నీళ్లు ఒక్కసారిగా వదలడంతో చాలాచోట్ల నారుమళ్లు నీట మునిగి కుళ్లిపోయాయి. అడవికొలను గ్రామం కలందకోడు పాయ, దొంగపర్రు, దాళ్వాపర్రిపాయల్లో నారుమళ్లు మొత్తం నాశనమైపోయాయి. దాదాపు రెండువేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశకు చేరుకున్న నారు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతోపాటు రెవెన్యూ అధికారులు  మామూళ్ల మత్తులో జోగుతుండడం వల్లే ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిడమర్రుతోపాటు  అడవికొలను, పెదనిండ్రకొలనుల్లో చేపల చెరువులుగా మారిన అత్యధిక పొలాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధాన రహదారికి పక్కనే రొయ్యల సాగు జరుగుతున్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.  ఇంత జరుగుతున్నా.. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు. ప్రశ్నించిన రైతులకు ఆక్వా మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్టు  సమాచారం. ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు పడతారంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది.  దీంతో నారుమళ్లు నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. నారుమళ్లు నష్టపోవడంతో ఇప్పుడు  వేరే చోట నారు కొని తెచ్చి నాట్లు వేసినా ఆ తర్వాత చెరువుల నుంచి కలుషిత నీరు వదిలితే ఏం చేయాలోనని మధనపడుతున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.
 
 
 
 
 
 
 
 . 
 
 
మరిన్ని వార్తలు