భద్రాద్రిలో ఆక్టోపస్ సర్వే

28 Oct, 2015 20:02 IST|Sakshi
భద్రాద్రిలో ఆక్టోపస్ సర్వే

భద్రాచలం: ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాల వంటి జనసమ్మర్థ ప్రదేశాలనే సంఘవిద్రోహ శక్తులు టార్గెట్ చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయం భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బుధవారం ఆక్టోపస్ బృందాలు భద్రాది ఆలయ పరిసరాలల్లో సమగ్ర సర్వే నిర్వహించారు.

డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్ నుంచి వెళ్లిన బృందంతోపాటు భద్రాచలం పోలీసులు, రామాలయ సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ అధికారులు, ఫైర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆలయానికి దారి తీసే అన్ని మార్గాలు, దర్శనం తరువాత ఆలయం లోపల నుంచి భక్తులు బయటకు వచ్చే దారులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

రామాలయం వ్యూకు సంబంధించిన మ్యాప్‌ను సరిపోల్చుకుంటూ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి, నమోదు చేసుకున్నారు. అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై తగిన సూచనలు చేసే క్రమంలోనే ఆక్టోపస్ బందం సర్వే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వివరాలను మీడియాకు వెల్లడించేందుకు సదరు అధికారులు నిరాకరించారు. సంఘ వ్యతిరేక శక్తుల దాడులను ఏ రీతిన తిప్పికొట్టాలనే దానిపై మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.

మరిన్ని వార్తలు