కాశీ విశ్వనాథ్‌ దంపతులకు ఘనసన్మానం

16 Jan, 2017 00:07 IST|Sakshi
కాశీ విశ్వనాథ్‌ దంపతులకు ఘనసన్మానం
సీతానగరం (రాజానగరం) :
వంద చిత్రాల్లో నటించిన సందర్భంగా దర్శకుడు, సహజ నటుడు యనమందల కాశీ విశ్వనాథ్, హేమలత దంపతులను ఆదివారం రాత్రి వంగలపూడి గ్రామస్తు లు ఘనంగా సన్మానించారు. స్థానిక రామాలయం వద్ద ముసునూరి వీరబాబు ఆధ్వర్యాన, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ అధ్యక్షతన ఈ పౌర సన్మాన సభ నిర్వహించారు. సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 23 మంది హీరోలతో, 350 సినిమాలకు రాసే అదృష్టాన్ని తెలుగు సినీ పరిశ్రమ తనకు కల్పించిందన్నారు. ‘వైశాఖం’ చిత్రంతో ఆరేళ్లలో వంద చిత్రాలు పూర్తి చేసుకున్న కాశీ విశ్వనాథ్‌ అభినందనీయుడన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పండగ సందర్భంగా ఈ ప్రాంత నటుడిని సన్మానించడం అభినందనీయమన్నారు. కాశీ విశ్వనాథ్‌లో 1500 చిత్రాల్లో నటించే సత్తా ఉందని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కందుల దుర్గేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ¯ŒS బైర్రాజు ప్రసాదరాజు, ప్రముఖ సినీ నటి హేమ, దర్శకుడు శ్రీవాస్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘పోలవరం’ వైఎస్సార్‌ చేపట్టినదే..
పోలవరం ప్రాజెక్ట్‌ను చేపట్టినది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనన్నది ముమ్మాటికి నిజమని నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. కాశీ విశ్వనాథ్‌ సన్మానసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును ఒకసారి కలిశానని, వైఎస్సార్‌ చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, సస్యశ్యామలం చేయాల్సిందిగా కోరానని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుడు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి నీరుకొండ వెంకట రామారావు వంగలపూడిలో జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. చిత్రరంగంలో అందరికీ తలలో నాలుకగా నిలిచే నటుడు కాశీవిశ్వనాథ్‌ అని కొనియాడారు. అనంతరం ‘ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా’ పాటను ఆలపించి సభికులను ఉర్రూతలూగించారు. అనంతరం కాశీవిశ్వనాథ్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవ కమిటీ సభ్యులు వెండి కిరీటంతో సత్కరించారు.
 
మరిన్ని వార్తలు