బతికున్నంత వరకూ తెరపై మెప్పిస్తా

8 Oct, 2016 08:43 IST|Sakshi
బతికున్నంత వరకూ తెరపై మెప్పిస్తా

జి.పెదపూడి (పి.గన్నవరం) : తాను జీవించి ఉన్నంత వరకూ తెరపై కనిపిస్తూ, ప్రేక్షకులను మెప్పించాలన్నదే తన లక్ష్యమని సినీ నటి, ప్రముఖ బుల్లితెర యాంకర్‌ రష్మి పేర్కొన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, టీవీ లేదా సినిమాల్లో నటిస్తూ అందరినీ నవ్విస్తూనే ఉంటానని చెప్పారు. సినీ ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆమె జి.పెదపూడిలోని మంతెన రవిరాజు నివాసంలో విలేకరులతో ముచ్చటించారు. బుల్లితెర తనకెంతో గుర్తింపు తెచ్చిందన్నారు.

ఇంత వరకూ తాను జబర్దస్త్‌ 270 ఎపిసోడ్లలో నటించానని వివరించారు. హీరోయిగా తన తొలి సినిమా ‘గుంటూరు టాకీస్‌’ అని, తాజా సినిమా ‘తను వచ్చెనంట’ ఈ నెలాఖరులో విడుదల కానుందని వెల్లడించారు. వచ్చే అక్టోబర్‌ 31న ప్రముఖ గాయని గీతామాధురి భర్త నందుతో ప్రభాకర్‌ డైరెక్షన్‌లో కొత్త సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు. జాంబి పాత్రలో తాను నటించిన ‘తను వచ్చెనంట’ సినిమా హాస్య పరంగా ప్రేక్షకులకు మెప్పిస్తుందని తెలిపారు. తనకు నచ్చిన యాంకర్‌ తానేనని, తనకు స్ఫూర్తినిచ్చిన నటి మాధురీ దీక్షిత్‌ అని చెప్పారు.

నేను విశాఖ అమ్మాయినే..
తాను విశాఖపట్నానికి చెందిన తెలుగు అమ్మాయినని రష్మి చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన తండ్రి దేవనాథ్‌ అక్కడ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన తల్లి సబిత విశాఖపట్నంలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారని వివరించారు. కోనసీమ అందాలు తనకు ఎంతగానో నచ్చాయని, ఈ ప్రాతం సినిమా షూటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. ఆమె వెంట సినీ డైరెక్టర్‌ వెంకట్, సినీ యూనిట్‌ కో–ఆర్డినేటర్‌ మంతెన రవిరాజు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు