నాలాంటివాళ్లు తలదించుకునేలా: జమున

2 Jan, 2017 19:03 IST|Sakshi

ఒకప్పటి వెండితెర స్వర్ణయుగ రూపశిల్పుల్లో ప్రముఖ సినీనటి జమున ఒకరు. దాదాపు 200 సినిమాల్లో, అందులోనూ అత్యధిక బాక్సాఫీస్‌ హిట్లు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో మూడు దశాబ్దాలకు పైగా ముందువరుసలో కొనసాగిన నటీమణి.  కళాభారతి, ప్రజానటిగా గుర్తింపుపొందిన జమున స్వస్థలమైన తెనాలిలో పోలేపెద్ది  నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారక రామారావు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి తొమ్మిదో నాటికోత్సవాల్లో ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. నేటి తెలుగు సినిమాలు తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

తెనాలి అంటే నాకెంతో మమకారం. కళానిలయం తెనాలి అనగానే గుర్తొచ్చేది జగ్గయ్య, గుమ్మడి, కృష్ణ.. మూడుసార్లు ఊర్వశి అవార్డు పొందిన శారద. ఇలా ఒక్కొక్కరినీ తలచుకుంటే ఎంతో ఆనందమేస్తుంది. ప్రసిద్ధి చెందిన నాటక కళాకారులకు పుట్టిల్లు తెనాలి. చిన్నతనంలో ఇక్కడకొచ్చి సినిమాలు చూసేవాళ్లం. జగ్గయ్య తీసిన ‘పదండి ముందుకు’ సినిమాలో ఆయనతోపాటు నేనూ, జి.వరలక్ష్మి నటించాం. ఇక్కడే కాలువ ఒడ్డున షూట్‌ చేశారు. బ్రిటిష్‌ వారి దౌర్జన్యానికి బలైన పాత్రలో జి.వరలక్ష్మి నటించారు. ఆమె శవాన్ని మోసుకెళుతున్న సీను ఇక్కడ తీశారు.

ఇక్కడే బాపూజీని చూశా
నేను కర్ణాటకలోని హంపీలో పుట్టానని నన్ను హంపీ సుందరి అంటారు. పసుపు, పొగాకు ఎగుమతి వ్యాపారంలో మా నాన్న దుగ్గిరాల వచ్చి స్థిరపడ్డారు. ఐదో ఏట నుంచి సినిమాల్లోకి వెళ్లే వరకూ నా బాల్యం అక్కడే గడిచింది. దుగ్గిరాల అమ్మాయిగానే చలామణి అయ్యాను. బాల్యంలోని ఎన్నో మధురస్మృతులు ఇంకా గుర్తున్నాయి. 9–10 ఏళ్ల వయసులోనే తెనాలి సమీపంలో పూజ్య బాపూజీని చూడటం గొప్ప అనుభూతి. హైస్కూల్‌లో చదివేటపుడే ప్రజానాట్యమండలి వారి ‘మా భూమి’ నాటకంలో ఒక పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టాను. ఆ క్రమంలోనే చెన్నైకి వెళ్లి సినిమా రంగంలోకి ప్రవేశించాను.

రంగస్థల సమాఖ్య ఏర్పాటు
రంగస్థలంపై మమకారంతో రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్యను ఏర్పాటుచేశాను. తెనాలిలోనూ శాఖ నడిచింది. రాష్ట్రవ్యాప్తంగా 26 శాఖల్లో 10వేల మంది కళాకారులు సభ్యులుగా ఉండేవారు. అన్నం పెట్టిన రంగస్థలానికి ఊపిరిపోస్తున్న కళాకారులు, సమాజాలను ప్రోత్సహించాలనే భావనతో పింఛన్లు, ఇళ్ల నిర్మాణానికి సహకారం, ఇతర సేవాకార్యక్రమాలు నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమి అధ్యక్షురాలిగా వీటిని విస్తృతం చేశాను. పేదకళాకారులకు నెలనెలా పింఛన్లు, సురభి సమాజాలకు ప్రోత్సాహం, బళ్లారి రాఘవ పేరిట  తపాలబిళ్ల విడుదల నా హయాంలోనే..

తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక స్తబ్దత
ప్రస్తుతం సాంస్కృతికపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్తబ్దత నెలకొంది. ఔత్సాహికులకే కాదు, వృత్తి కళాకారులకు సైతం ఎలాంటి ప్రోత్సాహకాలు అందట్లేదు. ఎప్పట్నుంచో ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ‘సురభి’ వైభవం తెలంగాణ వచ్చాక తగ్గిపోయిందని నా భావన. ప్రభుత్వపరంగా  అకాడమీల పునరుద్ధరణ జరగాలన్నది నా అభిమతం. ఈ మాత్రమైనా కళాసేవ జరుగుతుందంటే ఇలాంటి నాటక సమాజాల వల్లనే.

చెడు ఎక్కువ చూపిస్తున్నారు..
తెలుగు సినిమాల్లో చోటుచేసుకున్న మార్పులు కచ్చితంగా సమాజానికి మంచి కలిగించేవి కావు. నాడు భక్త పోతన సినిమా చూసి ఒక బాలయోగి వస్తే, ఈ రోజుల్లో సినిమాలు చూసి రోడ్డుసైడ్‌ రోమియోలు పుట్టుకొస్తున్నారు. నాలాంటి సీనియర్‌ నటీనటులు తలదించుకునేలా ఉంటున్నాయి. మేం చిత్రరంగానికి వచ్చాక ప్రభోదాత్మక/ ప్రయోగాత్మక సినిమాలెన్నో వచ్చాయి. నైతిక విలువలే కాకుండా సంఘానికి పనికొచ్చే మంచిని ప్రభోదించాయి. ప్రస్తుతం చెడు ఎక్కువగా చూపిస్తున్న ఫలితంగా యువతరం చెడుమార్గంలో నడుస్తోంది. సామూహిక అత్యాచారాలనూ ఎక్కువగా వింటున్నాం. ఇది మంచి పరిణామం కాదని నా భావన. 

మరిన్ని వార్తలు