సాహితీవనంలో తులసిమొక్క ‘అద్దేపల్లి’

22 Jan, 2017 22:14 IST|Sakshi
  • సంస్మరణసభలో ప్రముఖుల నివాళి
  • ‘అల్లూరి’ వీరగాథ ఆవిష్కరణ 
  • కాకినాడ కల్చరల్‌ :
    ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహితీవనంలో తులసి మొక్కవంటి వారని ప్రముఖ సాహితీవేత్త గిడ్డి సుబ్బారావు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్‌లో అద్దేపల్లి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో  అద్దేపల్లి సంస్మరణ సభ గిడ్డి అధ్యక్షతన అదివారం జరిగింది. అద్దేపల్లి రచించిన వచనకవితా విప్లవ వీరకథాకావ్యం ‘అల్లూరి సీతారామరాజు’ను గిడ్డి ఆవిష్కరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా గిడ్డి మాట్లాడుతూ అద్దేపల్లి నడిచే గ్రంథాలయం వంటి వారన్నారు.‘అల్లూరి సీతారామరాజు’ కావ్యంపై సాహిత విమర్శకులు మేడి రవికుమార్‌ సమీక్ష చేశౠరు. తెల్లదొరల పాలనపై పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు  గాథ మనందరికి ఆదర్శంగా నిలిచే విధంగా అద్దేపల్లి రచించారన్నారు.  అద్దేపల్లి కవిత్వమే శ్వాసగా జీవించారని మరో రచయిత డాక్టర్‌ శిరీష అన్నారు. దేశ విదేశాల్లో పేరుగాంచిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై  అద్దేపల్లి సంధించిన విమర్మనాస్త్రం సంచలనం సృష్టించిందని కవి, విమర్శకులు కె.వి.రమణారెడ్డి అన్నారు. కవనలోకంలో వెలుగులు విరజిమ్మే ధృవతార అద్దేపల్లి మనల్ని వదిలి వెళ్ళి వసంతం  గడిచినా, ఆయన రచనల గుబాళింపు తగ్గలేదని విమర్మకులు వాసా భూపాల్‌ అన్నారు. అద్దేపల్లి  సాహిత్య వ్యవసాయంలో ఎందరో కవులు  పుట్టుకొచ్చారని రచయిత పి.సీతారామరాజు అన్నారు. మహాకవి అద్దేపల్లి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనని కవి సయ్యద్‌ సాలర్‌ అన్నారు.  తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి  సమకాలీన పరిస్థితులపై ఆయన వందలాది వ్యాసాలను రచించి ప్రజలను ఉత్తేజపరిచారని కవి పద్మవాణి అన్నారు. అనేక మంది యువకవుల్ని  తయారు చేసిన ఘనత అద్దేపల్లి సొంతమని రచయిత అద్దేపల్లి రాధాకృష్ణ అన్నారు. సమకాలీన పరిస్థితులపై అప్పటికప్పుడు రచనలు చేయడం ఆయన శైలి అని వక్తిత్వ వికాస సమాజం కో ఆర్డినేటర్‌ అద్దేపల్లి ఉదయభాస్కర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితివేత్తలు, కవులు దేవదానంరాజు, భగవాన్, పి.వెంకటప్పయ్య, వీరలక్షీ్మదేవి తదితరులు పాల్గొన్నారు.
     
     
     
     
     
     
మరిన్ని వార్తలు