ఏఈలు కావలెను!

12 Sep, 2016 23:03 IST|Sakshi
ఏఈలు కావలెను!
 
  • కార్పొరేషన్‌లో 16 మంది ఏఈలకు గాను ఉండేది ఆరుగురే
  • ఇంజనీరింగ్‌ విభాగంలో నిలిచిపోయిన సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక నిధుల ప్రతిపాదనలు
  • మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరేనా?
 
నెల్లూరు, సిటీ : రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ సొంత జిల్లా అయిన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఇంజనీర్ల(ఏఈ) కొరత తీవ్రంగా ఉంది. 16 మంది ఏఈలకు గాను కేవలం 6 మంది మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. ఇటీవల ఆరుగురు తాత్కాలిక జూనియర్‌ ఏఈలు పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లారు. దీంతో నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, 14 ఆర్థిక సంఘం నిధులతో టెండర్లకు ప్రతిపాదనల్లో జాప్యం జరుగుతోంది. అంతేకాక ఇప్పటికే టెండర్లు పిలిచి, జరుగుతున్న పనుల నిర్మాణం ఆలస్యమవుతోంది. 
ఏఈల కొరత 
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్‌లు ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 54 డివిజన్‌లకు గాను కేవలం ఆరుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ముజాహిద్దీన్, పద్మజ, నాగేంద్రకుమార్, మూర్తి, సుదేష్ణ, రాజు ఉన్నారు. గత నెల వరకు జూనియర్‌ తాత్కాలిక ఏఈలు ఆరుగురి సహకారం ఉండడంతో ఇంజనీరింగ్‌ అధికారులు ఎలాగోలా నెట్టుకొచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వారి సహకారం ఉండడంతో కొంతవరకు నిర్మాణం చేయగలిగారు. ఇటీవల పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లిన తాత్కాలిక ఏఈలు ఆరుగురు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఈలపైనే అధిక పని భారం పడుతోంది. ప్రస్తుతం ఉన్న ఏఈల్లో కూడా ఒకరు అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. కేవలం 5 మంది విధుల్లో ఉన్నారు.
అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు
ఇంజనీరింగ్‌ విభాగంలో ఏఈల కొరత కారణంగా అధికార పార్టీ నాయకులకు సంబంధించి కాంట్రాక్ట్‌ బిల్లులు మంజూరు ఆలస్యమవడంతో అధికారులపై మేయర్‌ వర్గం, అధికార పార్టీ నాయకులు తమ బిల్లులు మంజూరు చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇతర కాంట్రాక్ట్‌ర్ల పనులకు సంబంధించి ఫైళ్లను పక్కన పెట్టి కేవలం మేయర్‌ వర్గం చెప్పిన వారి పనులు చేయడంపై కాంట్రాక్టర్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా జాప్యం జరుగుతోంది. 
చోద్యం చూస్తున్న మేయర్, కమిషనర్‌ 
ఇంజినీరింగ్‌ విభాగంలో ఏఈల కొరతతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంటే మేయర్‌ అజీజ్, కమిషనర్‌ వెంకటేశ్వర్లు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఈ నెల 15వ తేదీ నాటికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో టెండర్లు పిలవకపోతే కార్పొరేషన్‌ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అన్ని ప్రతిపక్ష పార్టీలు మేయర్, కమిషనర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అవసరమైన మేర ఏఈల నియామకం జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు