దసరా తర్వాత కంప్యూటర్‌ విద్య

28 Sep, 2016 04:30 IST|Sakshi
దసరా తర్వాత కంప్యూటర్‌ విద్య
ఏలూరు సిటీ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో దసరా తర్వాత కంప్యూటర్‌ విద్యను పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో జిల్లాలోని మళ్లీ ఈ విద్యను ప్రారంభించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో సర్కారు బడుల్లో కంప్యూటర్‌ విద్యను అమలు చేశారు. గత ఐదేళ్లుగా ఈ విద్య అటకెక్కింది. అప్పట్లో స్కూళ్ళకు ఇచ్చిన కంప్యూటర్లు బూజుపట్టి, నిరుపయోగంగా మారాయి. దీంతో కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ప్రత్యేక దృష్టిసారించి, జిల్లాలో కంప్యూటర్‌ విద్య పునఃప్రారంభానికి చొరవచూపారు. ఈ మేరకు జిల్లాలోని 283 ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే 283మంది ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి పరీక్ష నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం పాఠశాలల్లో కంప్యూటర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయని సమాచారం.  
అమలయ్యే పాఠశాలలివే.. 
జిల్లాలోని ఆయా యాజమాన్యాల్లోని ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రారంభిస్తారు. వీటిల్లో ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 3, సోషల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలు 5, గిరిజన పాఠశాలలు 2, ప్రభుత్వ పాఠశాలలు 13, మున్సిపల్‌ పాఠశాలలు 23, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 237 ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు 11కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఈ కంప్యూటర్లకు ఏవైనా ఇబ్బందులు వస్తే వీఎల్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ సేవలు అందిస్తుంది. ఈ స్కూళ్లలో పనిచేసే కంప్యూటర్‌ టీచర్లకు సర్వశిక్షాభియాన్‌ జీతాలు అందజేస్తుంది. రాష్ట్రీయ మాద్యమిక శిక్షాభియాన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. 
 రిజర్వేషన్‌ వివరాలు ఇలా.. 
కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 1286మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరంతా పరీక్షలు రాశారు. అయితే అధికారులు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ మేరకు నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల్లో ఎస్సీలకు 15శాతం, బీసీ–ఏకి 6, బీసీ–బీకి 10, బీసీ–సీకి 1, బీసీ–డీకి 7, బీసీ–ఈకి 4, వికలాంగులకు 3, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఓసీ జనరల్‌కు 50శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. మండలం ఒక యూనిట్‌గా ఎంపికలు చేపట్టనున్నారు. ప్రతీ పాఠశాలకూ ఒక రోస్టర్‌ పాయింట్‌ కేటాయిస్తారు. ఆ మేరకు ఆ కేటగిరీలో అభ్యర్థులు లేకుంటే ఆ తరువాత రోస్టర్‌లోని అభ్యర్థులతో పోస్టును భర్తీ చేస్తారు. ఈ రిజర్వేషన్‌ ఆధారంగా ఓసీ కేటగిరీలో 127 పోస్టులు, బీసీ–ఏకు 21, బీసీ–బీకి 27, బీసీ–సీకి 3, బీసీ–డీకి 19, బీసీ–ఈకి 11, ఎస్సీకి 42, ఎస్టీకి 18, పీహెచ్‌కి 9, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటాకు 6పోస్టులు కేటాయించారు. ఈనెల 29తేదీ నాటికి ఎంపికలు పూర్తిచేసి, దసరా అనంతరం ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరేలా నియామకాలు చేపట్టనున్నారు. 
పారదర్శకంగా నియామకాలు : 
కంప్యూటర్‌ విద్యకు సంబంధించి కంప్యూటర్‌ ఫ్యాకల్టీల నియామకాలు పారదర్శకంగా చేపడతాం. రిజర్వేషన్‌ ఆధారంగానే పోస్టులు భర్తీ చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో కంప్యూటర్‌ విద్యను పునఃప్రారంభించేందుకు కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు