మళ్లీ నగదు కష్టాలు

4 Jul, 2017 04:21 IST|Sakshi
మళ్లీ నగదు కష్టాలు
- ఏటీఎంల వద్ద నోక్యాష్‌ బోర్డులు
- బ్యాంకులలో తగ్గిన నిల్వ 
- ఆర్బీఐ చిల్లిగవ్వ విదల్చని వైనం
- 712 ఏటీఎంలకు పనిచేస్తున్నవి 150
- బ్యాంకు డిపాజిట్లకు ప్రజలు అనాసక్తి 
- స్వల్పంగానే నగదురహిత లావాదేవీలు
 
మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.  నెల రోజులుగా ఆర్బీఐ చిల్లిగవ్వ కూడా విదిల్చకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 596 బ్యాంకు శాఖల్లో రూ.488.99 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే  నగదు కష్టాలు పెరిగే  ప్రమాదం ఉంది. 712 ఏటీఎంలలో 150 ఏటీఎంలకు మించి పనిచేయడం లేదు. అవి కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. చిన్న బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు. ఖాతాదారులు నగదు డిపాజిట్‌ చేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. దీంతో నగదు కొరత ఏర్పడుతోంది. నగదు రహిత లావాదేవీలు నామమాత్రంగా కొనసాగుతుండడంతో నగదు కష్టాలు మొదటికొచ్చాయి. 
 
తిరుపతి (అలిపిరి): జిల్లాలో నగదు కట కట ప్రారంభమయ్యింది. గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత రెండు నెలల పాటు జిల్లాలో నగదు కష్టాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈఏడాది ఆరంభం తర్వాత నుంచి నగదు కష్టాల నుంచి పోయాయి. ఆర్బీఐ బ్యాంకులకు దశలవారీగా  నగదు పంపిణీ చేస్తూ వచ్చింది. నగదు రహితం పేరుతో జూన్‌లో ఆర్బీఐ పైసా కూడా విదల్చ లేదు. ఫలితంగా బ్యాంకులో నగదు నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం 40 జాతీయ బ్యాంకుల పరిధిలో 596 బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో రూ.488.99 కోట్లు మాత్రమే నిల్వ ఉంది. జూలై మొదటి వారంలో బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే  రెండు వారాల్లో నగదు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదముందని తెలుస్తోంది.
 
ఏటీఎంలలో నో మనీ..
జిల్లాలో 712 ఏటీఎం కేంద్రాలుంటే 150కు మించి పనిచేయడం లేదు. వాటిలో కూడా గంటల వ్యవధిలో నగదు ఖాళీ అవుతోంది. దీంతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు. చిన్న బ్యాంకు శాఖలు ఏటీఎం కేంద్రాలను నిర్వహించలేక తాత్కాలికంగా మూసివేశాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, పుంగనూరు వంటి ప్రాంతా ల్లో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, కరూర్‌ వైశ్యాబ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ శాఖలకు చెందిన ఏటీఎంలలో నగదు లేక బోసిపోయాయి. సోమవారం మధ్యాహ్నం ఎస్బీఐ శాఖలకు చెందిన ఏటీఎంలో నగదు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొద్దిసేపట్లోనే నగదు ఖాళీ అయిపోయింది. 
 
నగదు డిపాజిట్లకు అనాసక్తి
ఖాతాదారులు బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారే గాని డిపాజిట్‌ చేయడం లేదు. దీంతో బ్యాంకులో రొటేషన్‌ ఆగిపోయింది. మూడుసార్లకు మించి నగదును డిపాజిట్, విత్‌డ్రాలు  చేస్తే సేవా పన్ను విధిస్తామని బ్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు.
 
నామమాత్రంగా నగదు రహితం..
నగదు కష్టాల నుంచి గట్టేక్కడానికి నగదు రహితం ఒక్కటే శరణ్యమని అధికారులు చెప్పుకొచ్చారు. బ్యాంకర్లు కూడా దీనినే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే లావాదేవీల్లో ఖాతాదారులు దారుణంగా మోసపోతున్నాడు. స్వైపింగ్‌ ద్వారా కొనుగొలు చేసే ఖాతాదారులకు రూ.100కి రూ.1.20 సర్వీసు ట్యాక్స్‌ పడుతోంది.  మొబైల్‌ బ్యాంకింగ్, నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ వాలెట్‌ ద్వారా చెల్లింపులు చేస్తే కంటికి కనిపించకుండా సర్వీసు చార్జీల పేరుతో నగదు ఖాతాల్లోనుంచి మాయమవుతుండడంతో ప్రజలు నగదు రహితం జోలికి వెళ్లడానికి భయపడుతున్నారు. 
 
బ్యాంకుల్లో నగదు కొరత 
జిల్లా బ్యాంకుల్లో నగదు కొరత వాస్తవమే. ఏటీఎంలు పరిమితిగా> పనిచేస్తున్నాయి. ఆర్బీఐ నుంచి నగదు రావాల్సివుంది. నెల రోజులుగా జిల్లాకు ఆర్బీఐ నగదును పంపిణీ చేయలేదు. దీంతో బ్యాంకుల్లో తాత్కాలిక నగదు కొరత ఏర్పడింది. వారం రోజుల్లో నగదు చేరే అవకాశం వుంది.
–లక్ష్మీనారాయణ, డీజీఎం,లీడ్‌ బ్యాంక్, తిరుపతి 
మరిన్ని వార్తలు