-

మళ్లీ రోడ్డెక్కిన ఉల్లి రైతు

30 Aug, 2016 00:36 IST|Sakshi
– కొనుగోళ్లు ముందుగా నిలిపివేయడంపై ఆగ్రహం
–మార్కెట్‌ కమిటీ అధికారులతో వాగ్వాదం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి రైతులు మళ్లీ రోడ్డెక్కారు. కొనుగోళ్లను సోమవారం సాయంత్రం 4 గంటలకే ముగించడంతో.. నాలుగైదు రోజులుగా మార్కెట్‌లో పడిగాపుల కాస్తున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్కెట్‌లో ఉల్లి నిల్వలు పేరుకొనిపోయినా కొనుగోళ్లలో వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కెట్‌ కమిటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్‌కు ఎదురుగా వెంకటరమణ కాలనీకి వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఉల్లి ఎక్కువగా ఉన్నా.. పూర్తిగా కొనకుండా అర్ధాంతరంగా కొనుగోళ్లు ముగించడం దారణమన్నారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నాల్గో పట్టణ పోలీసులు వచ్చి రైతులకు సర్ది చెప్పి ధర్నాను విరమింప చేసి మార్కెట్‌ కమిటీ కార్యదర్శి దగ్గరకు రైతులను తీసుకెళ్లారు. మార్కెట్‌కు సరుకు ఎక్కువగా వస్తోందని, సోమవారం ఒక్కరోజే 18 వేల ప్యాకెట్లు కొన్నారని కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. కొన్న సరుకును తరలించుకోవాల్సి ఉన్నందున వేలంపాటను ముగించారన్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వేలంపాట ప్రారంభించి మిగిలిపోయిన ఉల్లిని పూర్తిగా కొనుగోలు చేస్తామని వివరించారు. 
 
మరిన్ని వార్తలు