ఎంపీ వ్యాఖ్యలపై ఎగసిన నిరసన

12 Dec, 2016 14:46 IST|Sakshi
ఎంపీ వ్యాఖ్యలపై ఎగసిన నిరసన
భీమవరం : గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండున్నరేళ్లుగా 40 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తుంటే పట్టించుకోని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఈ పరిశ్రమవల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని చెప్పడం ఆయన  దివాళాకోరుతనానికి నిదర్శనమని ఫుడ్‌పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. భీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో పోరాట కమిటీ నాయకులు మాట్లాడారు. పోరాట కమిటీ కన్వీనర్‌ ఆరేటి వాసు మాట్లాడుతూ భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న ఆక్వాపార్క్‌ కారణంగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలతో సహా 40 గ్రామాలు కాలుష్యం బారినపడి ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారన్నా రు. ఫ్యాక్టరీలో కలుషిత జలాలు గొంతేరు డ్రెయి¯ŒSలో కలవడం వల్ల నీరు కలుషితమై వరి, రొయ్యలు, చేపలు సాగుచేసే రైతులతో పాటు చేపలవేట సాగించే మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ గురించి, ప్రజల ఇబ్బందుల గురించి ఏమీ తెలియని ఎంపీ గంగరాజు ఏకపక్షంగా మాట్లాడటం దారుణమని చెప్పారు. ఎంపీ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పోరాట కమిటీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
పరిశ్రమను తరలించాలి
త్రిమూర్తులు మాట్లాడుతూ వేండ్రలోని ఎంపీ గంగరాజు డెల్టాపేపర్‌ మిల్లు కారణంగా యనమదుర్రు డ్రెయి¯ŒS కాలుష్యం బారిన పడగా గంగరాజు మాత్రం కాలుష్యం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణం ఆక్వా పరిశ్రమను తరలించాలని డిమాండ్‌ చేశారు. 
 
దళితుల మధ్య చిచ్చు
జొన్నలగరువు గ్రామానికి చెందిన తాడి దానియేలు మాట్లాడుతూ దళితుల్లో చిచ్చుపెట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలర్పించి అయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటామని చెప్పారు. యర్రంశెట్టి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. 
 
దిష్టిబొమ్మ దహనం
భీమవరం ప్రకాశంచౌక్‌లో ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎంపీ గంగరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి దిష్టిబొమ్మతో ప్రదర్శనగా ప్రకాశంచౌక్‌కు చేరుకుని ఎంపీకి వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశా రు. ప్రజల ఓట్లతో గెలిచిన గంగరాజు ఫ్యాక్టరీ ఎక్కడ కడుతున్నారో కూడా తెలుసుకోకుండా పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటం దారుణమని, తక్షణం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
మరిన్ని వార్తలు