కరువు క్షేత్రం

3 May, 2017 23:04 IST|Sakshi
కరువు క్షేత్రం

- ఓపన్‌ ఎయిర్‌ జైల్లో వ్యవసాయం కుదేలు
- భారీగా తగ్గిన జైలు ఆదాయం
- ఈ ఏడాది 9 లక్షలే ఆదాయం
- ఎండుతున్న మామిడి చెట్లు


ఖైదీల వ్యవసాయ క్షేత్రం.. ఎటు చూసినా పచ్చని చెట్లు.. కూరగాయలు, పండ్ల తోటలు, పూల మొక్కలు, జీవిత ఖైదీలు పనులు చేసుకుంటూ కనిపించేది. ఇదంతా రెండేళ్ల కిందటి మాట. నేడు ఎండిపోయిన చెట్లు.. వాడిపోయిన కాయలు, రాలిన ఆకులతో కళావిహీనంగా మారిపోయింది. కరువు రక్కసి పంజా విసరడంతో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయం ద్వారా జైలుకు వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది.
- బుక్కరాయసముద్రం (శింగనమల) :

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సమీపంలో ఓపన్‌ ఎయిర్‌ జైలు ఉంది. జైలుకు 1427.57 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 118 ఎకరాలు ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ నిర్మాణానికి, 500 ఎకరాలు సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి, 18.38 ఎకరాలు జిల్లా జైలుకు ఇచ్చారు. 45 ఎకరాల్లో ఓపన్‌ ఎయిర్‌ జైలు పరిపాలనా విభాగం ఉంది. 3 ఎకరాల్లో పెట్రోలు బంకులు, హోటల్‌ నిర్మాణాలు చేపట్టారు. వర్షాలు, హెచ్చెల్సీ నీటి ఆధారంగా 110 ఎకరాల్లో వేప, చింత టేకు చెట్లు పెంచుతున్నారు. మిగిలిన 600 ఎకరాల్లో 5 వేల వరకు వివిధ రకాల మామిడి చెట్లు, కాయగూరలు, వేరుశనగ, చిరుధాన్యాలు, గ్రాసం, పూల వంటి పంటలు సాగు చేస్తున్నారు.  

భారీగా తగ్గిన జైలు ఆదాయం
వర్షాభావం ప్రభావం ఓపన్‌ ఎయిర్‌ జైలు ఆదాయంపై పడుతోంది. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఆదాయం పెద్ద ఎత్తున పడిపోయింది. 2014–15లో రూ.42,66,241 పెట్టుబడి పెట్టగా రూ.37,60,770 ఆదాయం వచ్చింది. 2015–16లో రూ.24,03,346 పెట్టుబడి పెట్టగా రూ.32,95,840 ఆదాయం సమకూరింది. 2016–17లో రూ.23,05,559 పెట్టుబడి పెట్టగా రూ.9,62,350 ఆదాయం వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా గత ఏడాది మామిడి తోట వేలం వేయగా రూ.23 లక్షలు వచ్చింది. ఈ ఏడాది మామిడి తోట దిగుబడి లేక వ్యాపారస్తులు సరైన ధర పెట్టకపోవడంతో రెండుసార్లు వేలం వాయిదా పడింది. వర్షాలు లేక, హెచ్చెల్సీ నీరు అందక జైలులో మామిడి, టేకు చెట్లు నిలువునా ఎండపోతున్నాయి. ఎక్కడ చూసినా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.  

నీరుంటే మంచి ఆదాయం
ఓపన్‌ ఎయిర్‌ జైలులో వర్షాలు సక్రమంగా పడి, నీరు ఉంటే మంచి పంటలు పండించవచ్చు. జైలులో 80 మంది ఖైదీల వరకు ఉన్నారు. యంత్రాలు కూడా వినియోగించి పనులు చేయిస్తున్నాము. రెండేళ్లలో ఆదాయం 3 రెట్లు తగ్గిపోయింది. ఏ పని చేయించాలన్నా నీరు బాగా కావాల్సి వస్తోంది. ఇలాంటి కరువు పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. వర్షాలు వస్తే వేరుశనగ, కంది, మామిడి చెట్ల పెంపకం, కూరగాయలు సాగు పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాం.
- గోవిందరాజులు, సూపరింటెండెంట్‌, ఓపెన్‌ ఎయిర్‌ జైలు

మరిన్ని వార్తలు