జిల్లాలో 20 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు

14 Jun, 2017 23:10 IST|Sakshi
జిల్లాలో 20 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు
కాకినాడ సిటీ :
రైతులకు అద్దె విధానంలో వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలోని 18 మండలాల్లో 20 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో జరిగింది. కూలీల సమస్య నివారణ, ఉత్పాదక వ్యయం తగ్గింపుతో సాగును లాభదాయకం చేసేందుకు యంత్రాలు వాడేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులో భాగంగా యంత్రాలను అద్దెకు ఇచ్చే కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయన్నుట్టు చెప్పారు. నారుమడి నుంచి కోత, నూర్పుల వరకూ ప్రతి దశలో ఉపకరించే అన్ని యంత్రాలూ ఈ సెంటర్లలో అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లాలో కోరమాండల్‌ ఇంటర్నేషనల్, ఎస్కార్ట్స్, కొబాటా సంస్థల ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ సంస్థలకు ప్రభుత్వం యంత్రాలపై 50 శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. తదుపరి సమావేశంలో వివిధ యంత్రాలకు అద్దెలను ఖరారు చేస్తామన్నారు. వ్యవసాయశాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్, డీడీ లక్ష్మణరావు, మార్టేరు వ్యవసాయ శాస్త్రవేత్త జె.కృష్ణప్రసాద్, యంత్ర సంస్థల ప్రతినిధులు జాకబ్, రవీంద్ర, అభ్యుదయ రైతులు విశ్వనాథం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు