రేషం పురుగుల వ్యర్థాలతో కంపోస్టు

6 Dec, 2016 23:28 IST|Sakshi
రేషం పురుగుల వ్యర్థాలతో కంపోస్టు

అనంతపురం అగ్రికల్చర్‌ : రేషం (మల్బరీ) పురుగుల పెంచే సమయంలో రోజువారీ బయడపడేసే వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటే మంచి కంపోస్టు ఎరువు తయారవుతుందని పట్టు పరిశ్రమశాఖ సేవా కేంద్రం టెక్నికల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఏ ఫిరోజ్‌బాషా (89495 63802) తెలిపారు. చాలా మంది షెడ్డు పరిసర ప్రాంతాల్లో లేదా మరెక్కడైనా వృథాగా పడేస్తారన్నారు. దీని వల్ల రెండు విధాలుగా రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

ఎక్కడిక్కడ వదిలేస్తే దుర్వాసన ద్వారా పట్టు పురుగులకు రోగాలు వ్యాపిస్తాయన్నారు. మరోవైపు ఎరువుకు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎకరా మల్బరీ తోట పెంపకం ద్వారా ఏటా 4 నుంచి 6 టన్నుల సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చన్నారు. దీని వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గిపోవడమే కాకుండా సేంద్రియ పోషకాల ద్వారా నాణ్యమైన పంట దిగుబడులు చేతికి వస్తాయని తెలిపారు.

వ్యర్థాలు ఉపయోగించుకోండి : పట్టు పురుగులు పెంచే షెడ్డుకు కొంత దూరంలో నీడ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 4.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్‌ వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతను తవ్వుకోవాలి. ఎండ, వానల నుంచి రక్షణ కోసం గుంతపై పందిరి వేసుకోవాలి. పెంపకం సమయంలో రోజూ వచ్చే వ్యర్థ పదార్థాలను గుంతలో పొరలు పొరలుగా నింపాలి. ప్రతి అడుగు మందంపై పేడ నీటిని చల్లాలి. ఆ తర్వాత 25 కిలోల పాస్ఫేట్, 150 గ్రాములు సున్నం పొడిని చల్లాలి.

భూమి నుంచి ఒక అడుగు ఎత్తు వరకు కంపోస్టు గుంతను నింపి అ తర్వాత మట్టి లేదా పశువుల పేడతో కప్పేయాలి. గుంతను నింపిన 3 నుంచి 4 నెలల తర్వాత నాణ్యమైన కంపోస్టు ఎరువు తయారవుతుంది. ఇలా చేయడం వల్ల ఓ వైపు మంచి ఎరువు తయారు చేసుకోవడమే కాకుండా పట్టుపురుగుల పెంపకం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. దీని వల్ల రెండు విధాలా రైతుకు లాభం ఉంటుంది. వ్యర్థాలు పెంపకం పరిసరాల్లో వేయడం వల్ల దుర్వాసనతో పాటు పట్టుపురుగులకు అనేక రోగాలు వ్యాపించి పంట దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో కంపోస్టు తయారీకి చర్యలు తీసుకోవాలి. జిల్లాలో కొందరు రైతులు ఇలా వినియోగించుకుంటున్నా చాలా మంది అలాగే వదిలేస్తున్నారని తెలిపారు.   

మరిన్ని వార్తలు