విత్తన పొట్టేళ్లతో రాజయోగం

10 Jan, 2017 22:57 IST|Sakshi
విత్తన పొట్టేళ్లతో రాజయోగం

గుమ్మఘట్ట : మేలుజాతి విత్తన పొట్టేళ్ల ఎంపికతో జీవాలతో రాజయోగం పొందవచ్చంటున్నారు.. గుమ్మఘట్ట పశువైద్యాధికారి నవీన్‌కుమార్‌ (9704316313). ముఖ్యంగా విత్తన పొట్టేళ్ల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే అధిక ఆదాయాన్ని పొందవచ్చంటున్నారు. మేలుజాతి విత్తనపొట్టేలు..పోషణ.. వాటి ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ఇలా వివరిస్తున్నారు.

విత్తనం పొట్టేళ్లను బట్టి మంద అభివృద్ధికి 50 శాతం ఆధారపడి ఉంటాయి. అందుకే వీటిని మందకు సగంబలం అంటారు. ఒక సాధారణ ఆడ గొర్రె నుంచి ఏడాదిలో ఒకటి, రెండు కంటే ఎక్కువ పిల్లలు పొందలేం. అదే విత్తన పొట్టేలుతో ఏడాదికి 50 నుంచి 70 పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది.  

ఉపయోగాలివీ.. :  బలిష్టమైన పొట్టేలు మందలో ఉంటే..జాతి లక్షణాలు కలిగిన పిల్లలు జన్మిస్తాయి. పుట్టిన పిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిగొర్రె ఏడాదికి 2–3 కిలోల బరువు అధికంగా పెరుగుతుంది. తద్వారా జీవాల పెంపకం దారులు ఆర్థికంగా లాభపడుతారు.

శ్రేష్టమైన పొట్టేలు జాతి లక్షణాలు.. : విత్తన పొట్టేలు శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగి జీవకళ ఉట్టిపడుతుండాలి. చురుగ్గా, బలిష్టంగా, మగతనం ఉట్టిపడేలా లైంగికాసక్తి కలిగి ఉండాలి. శరీరం దృఢంగా పుష్టిగా ఉండాలి. కళ్లు మెరుస్తుండాలి. కాళ్లు బలంగా, గిట్టలు చక్కగా ఉండాలి. ముఖభాగంపై వెంట్రుకలు ఉండకూడదు.

పొట్టేళ్లను ఎంపికచేసుకునే విధానం.. : 2–4 ఏళ్ల వయసున్న పొట్టేళ్లను ఎంపిక చేసుకోవాలి. కవల పిల్లలు కనే సంతతి నుంచి పుట్టిన పొట్టేళ్లను ఎంచుకోవాలి. తమ ప్రాంతానికి అనువైన పొట్టేళ్లను ఎంపికచేసుకోవాలి.  సాధారణంగా విత్తనం పొట్టేలు కోసం మందలో పుట్టిన మగజాతి పిల్లని విత్తనం పొట్టేలుగా జీవాల పెంపకం దారులు వినియోగిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. సొంత రక్తసంబంధం నుంచి పుట్టిన పిల్లలు బలహీనంగా, అవిటిగా, సంతానోత్పత్తికి పనికి రాకుండా జన్యుపరమైన లోపాలు వస్తుంటాయి. కాబట్టి పొట్టేలును వేరే మంద నుంచి తెచ్చుకోవాలి. రెండేళ్ల వయసుదాటిన తర్వాత పోతును దాటేందుకు వినియోగించుకోవాలి.  

ప్రతి వంద జీవాలకు కనీసం నాలుగు పొట్టేళ్లకు తక్కువ కాకుండా మందలో ఉండేలా జాగ్రత్త వహించాలి. పొట్టేలను జీవాలు ఎదకు వచ్చే సీజన్‌లో మందతో కలిపి పంపిస్తే ఎదలోని జీవాలను దాటుతాయి. అలాగే ఎల్లప్పుడు మందలో ఉంచితే ఆడ గొర్రెలను ఆటపట్టిస్తూ మేపు సరిగ్గా తీసుకోనివ్వవు. చూడు జీవాలను పొడుస్తుంటాయి. యదలోని జీవాలను తరచూ దాటుతుండటం వల్ల వీర్యం వృథా అయి త్వరగా నీరసపడిపోయి లైంగికాశక్తిని కోల్పోతాయి. కాబట్టి పొట్టేలును విడిగా చూడటం మంచిది. విత్తన పొట్టేలుకు 5–6 ఏళ్ల వయసు మించి ఉండకూడదు. జత కలిపే సీజన్‌లో పొట్టేలుకు అదనంగా దాణా ఇవ్వాలి. మందలోని పొట్టేళ్లు పొట్లాడుకోకుండా గమనిస్తూ ఉండాలి.

>
మరిన్ని వార్తలు