కొత్త పద్ధతిలో మల్బరీ సాగు

1 Mar, 2017 22:07 IST|Sakshi
కొత్త పద్ధతిలో మల్బరీ సాగు

– కర్నాటక తరహా వృక్ష పద్ధతిలో అధిక దిగుబడి
- మన రైతులను ప్రోత్సహిస్తాం
– పట్టుశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సి.అరుణకుమారి


అనంతపురం అగ్రికల్చర్‌ : కొత్త పద్ధతిలో మల్బరీ సాగును ప్రోత్సహిస్తున్నట్లు పట్టు పరిశ్రమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చింతకుంట అరుణకుమారి, పట్టు సేవా కేంద్రం టెక్నికల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఏ ఫిరోజ్‌బాషా తెలిపారు. కర్నాటకలోని కోలార్, చిక్‌బళ్లాపూర్‌ జిల్లాల పరిధిలో రైతులు అనుసరిస్తున్న వృక్ష పద్ధతి ఇక్కడ కూడా అవలంభిస్తే మంచి దిగుబడులు వస్తాయన్నారు. ఆ దిశగా పట్టుశాఖ చర్యలు చేపట్టిందన్నారు.

వృక్ష పద్ధతిలో సాగు
వేప, చింత, ఇతర చెట్లు మాదిరిగా నీటి ఎద్దడిని తట్టుకుని పంట ఉత్పత్తులు అందించినట్లుగానే మల్బరీని కూడా వృక్ష పద్ధతిలో పెంచవచ్చు. దీని వల్ల తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చని కోలార్, చిక్‌బళ్లాపూర్‌ జిల్లాల రైతులు రుజువు చేశారు. ఈ తరహా పద్ధతిని జిల్లాలో అవలంభించడానికి వీలుగా ఇటీవల రైతులను కర్నాటక పర్యటనకు తీసుకెళ్లి అవగాహన కల్పించాం.

సాగు విధానం
వృక్ష పద్ధతిలో 4“4 అడుగులు గుంతలు తీసుకుని ఆరు నెలల వయస్సున్న నర్సరీ మల్బరీ మొక్కను నాటుకోవాలి. ఎకరాకు 420 మొక్కలు సరిపోతాయి. మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించాలి. నీటి వసతి తక్కువగా ఉంటే డ్రిప్‌ పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. గుంతలలో పశువుల ఎరువు, వర్మీకంపోస్టుతో పాటు జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా భూసారాన్ని పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత ఒక్కో చెట్టు నుంచి ఒక గుడ్డు మేపుకోవచ్చు. మొదటి సంవత్సరం మాత్రమే పెట్టుబడులు కొంత ఎక్కువగా ఉంటాయి. రానురాను పెట్టుబడులు బాగా తగ్గిపోతాయి. మూడున్నర అడుగుల ఎత్తు తర్వాత చెట్టును వృక్షం మాదిరిగా మార్పు చేసుకుని పురుగుల పెంపకం చేపట్టాలి. డాక్టర్‌ సాయిల్‌ అనే సేంద్రియ టానిక్‌ వాడాలి. ఎకరాకు ఒక లీటర్‌ మందు వేయి లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.  జిల్లాలో కూడా ఇప్పటికే కొంత మంది రైతుల చేత ఈ తరహా పద్ధతిని ప్రోత్సహించాం. మున్ముందు మరింత ఎక్కువ మంది రైతులు వృక్ష పద్ధతిలో చేపట్టేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం.

మరిన్ని వార్తలు