భూసార పరీక్షలతో పంట పండినట్లే!

3 Mar, 2017 21:53 IST|Sakshi
భూసార పరీక్షలతో పంట పండినట్లే!

‘అనంత’ భూముల్లో నత్రజని, జింక్‌ తక్కువే
– భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు
– వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పీవీ శ్రీరామమూర్తి

===================================
బంగరు పంటలు పండాలంటే భూసార పరీక్షలు కీలకం. అయితే చాలా మంది రైతులకు వాటికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో భూముల్లో ఏయే లోపాలున్నాయో గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. పెట్టుబడి కూడా విపరీతంగా పెరిగిపోతోంది. సుస్థిర వ్యవసాయ సాధించాలంటే సమగ్ర సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి.వి.శ్రీరామమూర్తి. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే...
 - అనంతపురం అగ్రికల్చర్‌
---------------------------------------------------
జిల్లాలో 90 శాతం ఎర్రగరప, 10 శాతం నల్లరేగడి భూముల్లో స్థూలపోషకాల(ఎన్‌–పీ–కే)లో నత్రజని శాతం తక్కువగా ఉందని గుర్తించారు. భాస్వరం, పొటాష్‌ పోషకాలు బాగానే ఉన్నాయని తేలింది. సూక్ష్మపోషకాలు(మైక్రోన్యూట్రియంట్స్‌) విషయానికొస్తే జింక్‌ లోపం ఎక్కువగా కనబడుతోంది. దీంతో భూమిలో పోషకాల సమతుల్యత ఏర్పడటంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి.  రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వాటి నుంచి బయటపడాలంటే భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకోవాలని జేడీ శ్రీరామమూర్తి తెలిపారు.

నత్రజని శాతం పెరగాలి
జిల్లాలో రెండు, మూడేళ్లుగా నిర్వహించిన భూసార పరీక్షలు, వాటి ఫలితాలను విశ్లేషిస్తే... 80 శాతం వరకు నత్రజని శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. అటు ఎర్రనేలలు, ఇటు నల్లరేగడి భూముల్లో ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి. ఎకరాకు 100 నుంచి 110 కిలోలు నత్రజని ఉన్నట్లు తేలింది. 112 కిలోల వరకు వచ్చినా నత్రజని శాతం తక్కువగానే ఉన్నట్లు పరిగణిస్తారు. 112 నుంచి 124 కిలోలు ఉన్నట్లు వస్తే మధ్యస్తంగాను, ఆపైన ఉంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. భాస్వరం ఎరువులు ఎకరాకు 10 కిలోల లోపు ఉంటే తక్కువగా, 10 నుంచి 24 కిలోలు ఉంటే మధ్యస్థంగా, అంతకన్నా అధికంగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు. జిల్లాలో ఎక్కువ శాతం భూముల్లో మధ్యస్థం కన్నా కాస్త ఎక్కువగానే భాస్వరం ఉంది. పొటాష్‌ ఎరువులు ఎకరాలో 136 కిలోల కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇది కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తేల్చారు.

70 శాతం భూముల్లో జింక్‌ లోపం
జిల్లా వ్యాప్తంగా 70 శాతం భూముల్లో జింక్‌ లోపం ఉన్నట్లు తేలింది. సాధారణం కన్నా 21 నుంచి 28 శాతం తక్కువగా జింక్‌ పోషకం కనిపిస్తోంది. బోరాన్‌ 3 నుంచి 4 శాతం తక్కువగా, మెగ్నీషియం ఒక శాతం తక్కువగా ఉంది. జింక్‌సల్ఫేట్, జిప్సం లాంటి ఎరువులు వాడటంతో జింక్‌పోషకాన్ని పెంచుకోవచ్చు. నత్రజని శాతం ఎక్కువగా ఉన్న ఎరువులు వాడాలి. రసాయన ఎరువులతో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఎరువులు, వర్మీకంపోస్టు, పిల్లిపెసర, జనుము, జీలుగ లాంటి పచ్చరొట్ట ఎరువులు, వేప, కానుగ లాంటి వృక్ష సంబంధిత సేంద్రియ ఎరువులు వాడాలి.

ఇలా చేస్తే వ్యవసాయం పండుగే..
రసాయన, సేంద్రియ పోషకాల వాడకంలో సమతుల్యత పాటిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఏ పంటకైనా స్థూలపోషకాలతో(మ్యాక్రో న్యూట్రియంట్స్‌) పాటు సూక్ష్మపోషకాలు(మైక్రో న్యూట్రియంట్స్‌), సేంద్రియ పోషకాలు(ఆర్గానిక్‌ న్యూట్రియంట్స్‌) సమపాళల్లో వేస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఒకే రకమైన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల పెట్టుబడి నష్టం తప్ప పంట దిగుబడులు వచ్చే అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ తమ పొలంలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయి, ఏ రకం ఎరువులు వేసుకోవాలనే విషయం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. వాటి ఫలితాలను బట్టి సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యం చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు