సస్యరక్షణకు సమయమిదే

6 Apr, 2017 23:38 IST|Sakshi
సస్యరక్షణకు సమయమిదే

అనంతపురం అగ్రికల్చర్‌ : మామిడి సీజన్‌ రావడంతో కాయలు దెబ్బతినకుండా వివిధ చీడపీడలు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు.

- కాయతొలచు పురుగు చిన్న కాయ దశ నుంచి పెద్ద కాయ వరకు ఆశిస్తుంది. కాయ ముక్కుభాగంలో నల్లటి రంధ్రంతో ఎండిన మామిడి కాయ లేదా పిందెల గుత్తులు చెట్టుకు వేలాడుతుండటం దీని లక్షణం. గోళీ సైజు కాయ దశలో ఒక్కో గొంగలి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలిగిస్తుంది. సాధారణంగా ఒక్కో మామిడికాయలో నాలుగు నుంచి ఆరు వరకు గొంగలి పురుగులు ఉంటాయి. చిన్నసైజు కాయలున్నపుడు పురుగులు ఒక కాయ నుంచి మరొక కాయకు మారి నష్టం కలిగిస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో తల్లి రెక్కల పురుగులు బయటకు వచ్చి పంటపై ఆశిస్తాయి.

- నివారణలో భాగంగా మామిడి పంట పూర్తయిన తర్వాత ఎండుకొమ్మలు పూర్తిగా కత్తిరించి నాశనం చేయాలి. పంట కోత తర్వాత కొమ్మలు, కాండం పగుళ్లలో ఉన్న గొంగలి పురుగులను నివారించాలి. మొత్తని ఎండు పుల్లలను కొమ్మ చుట్టూ గుత్తులుగా కట్టి నిద్రావస్థకు చేరిన గొంగలి పురుగులను ఒకేసారి నాశనం చేయవచ్చు. గొంగలి పురుగుల నివారణకు 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్‌ + 1.5 మి.లీ డైక్లోరోవాస్‌ లీటర్‌ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. 5 శాతం వేపగింజల కషాయం లేదా 1 శాతం వేపనూనె 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకున్నా పురుగులు అదుపులోకి వస్తాయి. లేదంటే గోలీకాయ సైజులో ఉన్నప్పుడు 1 మి.లీ డెల్లామిత్రిన్‌ 28 ఈసీ లీటర్‌ నీటికి కలిపి రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకుంటే ఫలితం ఉంటుంది.

- మామిడి కాయలు పక్వానికి వచ్చినపుడు, ఆలస్యంగా కోత కోసినపుడు పండు ఈగ ఆశించి నష్టం కలిగిస్తుంది. తల్లి ఈగలు ఎరువు, గోధుమ రంగులో కలిసిన శరీరంతో పసుపు పచ్చని చారలు కలిగి ఉండి, ఒకే జత రెక్కలతో తోటల్లో ఆకుల అడుగు భాగంలో ఎగురుతూ ఉంటాయి. ఇవి తల్లి ఈగలుగా మారి తమ జీవిత చక్రాన్ని కొనసాగిస్తాయి. పండుఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్లిపోయేలా, రాలిపోయేలా చేస్తాయి. పురుగు ఆశించిన కాయలు తినడానికి కానీ, గుజ్జు, రసం తీయడానికి కాని పనికిరాకుండా పోతాయి.

- పండు ఈగ నివారణలో భాగంగా రాలిపోయిన పండ్లను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల కింద దున్ని కోశస్థ దశలో ఉన్న పురుగులను బయటపడేలా చేయాలి. ప్లాస్టిక్‌ పళ్లెంలో 2 మి.లీ మీథైల్‌ యూజినాల్‌ + 3 గ్రాములు కార్భోఫ్యూరాన్‌ 3 జి గుళికలు ఒక లీటర్‌ నీటికి కలిపి తోటలో వేలాడదీయాలి. లేదంటే 2 మి.లీ మలాథియాన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి.

మరిన్ని వార్తలు