అప్రమత్తతోనే గొంతువాపునకు చెక్‌ !

11 Jun, 2017 22:54 IST|Sakshi
అప్రమత్తతోనే గొంతువాపునకు చెక్‌ !

– పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్‌ పద్మావతి
అనంతపురం అగ్రికల్చర్‌ : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పశువులు, గేదెలకు గొంతువాపు (హిమరేజిక్‌ సెప్టిసేమియా) సోకే ప్రమాదం ఉందని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (యానిమల్‌ డిసీసెస్‌ డయోగ్నస్టిక్‌ ల్యాబ్‌) సహాయ సంచాలకులు డాక్టర్‌ జి.పద్మావతి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండే వ్యాధి నివారించొచ్చన్నారు.

గొంతువాపు వ్యాధి
ఈ వ్యాధి పోస్చురెల్లామల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. తొలకరి సమయంలో పల్లపు ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా గేదెలు, దున్నల్లో కనిపిస్తుంది. ఆవుల్లో కాస్త తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గినపుడు, వర్షాల్లో తడిసినపుడు, ఈ పరిస్థితుల్లో అటు ఎండుగడ్డి ఇటు పచ్చిగడ్డి మేపడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వ్యాధికారక సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధి సోకడానికి కారణమవుతాయి. బురద ప్రదేశాల్లో తిరగినప్పుడు ఇది వ్యాపిస్తుంది. సరిగా మేత మేయకున్నా, నీరసించినప్పుడు, అలసటగా ఉన్నపుడు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన మేత, నీటి ద్వారా ఒకదాని నుంచి మరో పశువుకు సులువుగా వ్యాపిస్తుంది.

లక్షణాలు, చికిత్స
104 నుంచి 105 డిగ్రీల మేర జ్వరం రావడం, శ్వాస వేగంగా తీసుకోవడం, ఆకస్మికంగా చనిపోవడం, దవడల మధ్య, గొంతు పైభాగాన, మెడ కింద వాపు వస్తుంది. ఈ వాపులో రక్తం కనిపిస్తుంది. కళ్లు ఎర్రగా తయారై నీరుగారుతుంది. ఆయాసంతో శ్వాస పీల్చుతూ గుర్రు గుర్రు మంటూ శబ్ధం వస్తుంది. దీన్ని గురక రోగమని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన పశువులు నాలుక బయటకు తీస్తాయి. 24 నుంచి 48 గంటల్లోగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి అవసరమైన వైద్య చికిత్స, యాంటీబయాటిక్‌ మందులు వాడాలి. వ్యాధి సోకిన పశువులు లేదా గేదెలను మిగతా వాటిలో కలవకుండా వేరు చేయాలి.  పశువుల కొట్టాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వైద్యుల సూచన మేరకు రసాయన, క్రిమిసంహారక ముందులు వెదజల్లాలి. పశువులు తినగా మిగిలిన గడ్డిని కాల్చివేయాలి. మలమూత్రాలను లోతైన గుంతల్లో పూడ్చిపెట్టాలి. చనిపోయిన కళేబరాన్ని లోతుగా గుంత తవ్వి అందులో సున్నం వేసి పాతిపెట్టాలి. తొలకరి సమయంలో ముందస్తుగా టీకాలు వేయించి పశువులకు గొంతువాపు వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు.

మరిన్ని వార్తలు